వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది

24 Oct, 2021 16:14 IST|Sakshi

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య 

మృతదేహాన్ని శివార్లలో పడవేసే ప్రయత్నం  

తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆగిన కారు 

ఏమీ తోచక విడిచిపెట్టిపోయిన నిందితులు 

కారులోని శవాన్ని కనుగొన్న స్థానికులు 

కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

సాక్షి,హయత్‌నగర్‌(హైదరాబాద్‌): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది ఓ భార్య. ప్రియుడితో కలిసి అతడిని చంపించింది. మృతదేహాన్ని కారులో రహస్యంగా తరలించి శివార్లలో పడేసేందుకు ప్రయత్నించగా అది మార్గ మధ్యలోనే చెడిపోయి నిలిచిపోవడంతో నిందితుల బండారం బయటపడింది. ఈ ఘటన శని వారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..  

►  నగరంలోని సైదాబాద్‌లో ఉంటున్న మహమూద్‌ ముస్తాక్‌ పటేల్‌ (46) లారీ డ్రైవర్‌. అతని భార్య ఫిర్జోద్‌ బేగం కూరగాయల వ్యాపారం చేస్తోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హయత్‌నగర్‌ రేడియో స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ పురాతన మారుతీ కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ముఖంపై కారం పొడి చల్లి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించారు.  
►  మృతదేహం వద్ద లభించిన ఆధారాలతో మహమూద్‌ ముస్తాక్‌ పటేల్‌గా గుర్తించారు. ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ జరిపారు. ఫిర్జోద్‌ బేగానికి మహ్మద్‌ అమీద్‌ పటేల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెల్లడైంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు కొంత కాలంగా ఆమె ప్రత్నిస్తున్నట్లు తేలింది.  
►  ఈ క్రమంలో ఫిర్జోద్‌ బేగం, ప్రియుడు అమీద్‌ పటేల్‌తో పాటు అతడి స్నేహితుడు సయ్యద్‌ నయబ్‌తో కలిసి నగర శివార్లలో ముస్తాక్‌ పటేల్‌ను కత్తులతో గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని దూరంగా పడవేసేందుకు కారులో తీసుకెళ్తుండగా హయత్‌నగర్‌లో కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ముఖంపై కారం చల్లారు. కారు నంబర్‌ ప్లేటు కనిపించకుండా చేసి అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికులు కారులోని శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టు రట్టయ్యింది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

చదవండి: రూ.లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు ఇస్తాం 

మరిన్ని వార్తలు