అక్కను చంపాడనే కోపంతో..

22 Jul, 2021 09:44 IST|Sakshi

సాక్షి, జనగామ(వరంగల్‌): అక్కను చంపాడనే కోపంతో బావపై బామ్మర్ధి హత్యాయత్నం చేసిన ఘటన జనగామ జిల్లా నడిబొడ్డున బుధవారం జరిగింది. మద్యం మత్తులో గంట పాటు జరిగిన గొడవలో బావ కత్తిపోట్లకు గురయ్యాడు. వివరాలు.. జనగామ జిల్లా నర్మెట మండలం ఉప్పలగడ్డ తండాకు చెందిన కారు డ్రైవర్‌ బానోతు చంద్రశేఖర్‌ రాయపర్తి మండలం ఆరెగూడెం తండాకు చెందిన సరితను గత ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు.

భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. తరుచూ గొడవ పడేవారు. కుటుంబంలో కలహాలు ముదిరి పోవడంతో భర్త చంద్రశేఖర్‌ తనభార్య సరితను 2021 ఫిబ్రవరిలో హత్య చేశాడు. రెండు నెలలుగా జైలులో ఉన్న చంద్రశేఖర్‌ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. తన అక్కను చంపేశాడని కోపం పెంచుకున్న బామ్మర్ధి రమేష్‌ బావపై దాడి చేసేందకు అదును కోసం ఎదురు చూశాడు. 

వైన్స్‌లో ముదిరిన గొడవ...
జిల్లా కేంద్రంలో బుధవారం కలుసుకున్న వీరు సిద్దిపేట రోడ్డులోని ఓ వైన్స్‌లో మద్యం సేవించేందుకు వెళ్లారు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో పక్కనే ఉన్న మిగతా మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బయటకు వచ్చారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న బామ్మర్ధి రమేష్‌ తనవెంట తెచ్చుకున్న కత్తితో బావ చంద్రశేఖర్‌పై మొదటిపోటు వేశాడు. చంద్రశేఖర్‌ పారిపోతుండగా... వెంబడించాడు. ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో డివైడర్‌ ఎక్కి అటువైపు దూకుతుండగా.. మరో కత్తిపోటు వేయడంతో చంద్రశేఖర్‌ అక్కడే కుప్పకూలిపోయాడు.  

చంద్రశేఖర్‌పై కూర్చుని మెడ, చెవి, చేయిపై కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో కొందరు యువకులు రమేష్‌ను పట్టుకుని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బాలాజీవరప్రసాద్, ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి పరుగున చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న చంద్రశేఖర్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించి... రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏసీపీ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ రమేష్‌ అక్క సరితను బావ చంద్రశేఖర్‌ హత్య చేశాడనే కోపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడని తెలిపారు.  ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు