వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యయత్నం

24 Aug, 2020 08:56 IST|Sakshi
న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకుంటున్న బాధిత కుటుంబసభ్యులు

సాక్షి, అదిలాబాద్‌‌: అసభ్యకర చిత్రాలను ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం ఉదయం నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో చోటు చేసుకొంది. ముథోల్‌ సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం యాదవ్‌ అలియాస్‌ పన్ను అదే ఊరిలోని ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలను యువకుడు ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టులు చూసి మనస్తాపం చెందిన సదరు వివాహిత శనివారం ఇంట్లో పురుగుల మందు తాగింది.

కుటుంబసభ్యులు గమనించి ముథోల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడకు చేరుకున్న ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై అశోక్, భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు భైంసా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్బయ యాక్టు కింద కేసు నమోదు చేసి..ఆదివారం రిమాండ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు.  

న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. 
ముథోల్‌ సర్పంచ్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం బాధితురాలి బంధువులు, స్థానికులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని కలిశారు. నిందితుడు పురుషోత్తం యాదవ్‌పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడానని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు