అమలాపురంలో మహిళ దారుణ హత్య

15 May, 2021 08:48 IST|Sakshi
అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌లో హత్యకు గురైన కొండ్రు దుర్గ  

కాపు కాసి తల్లీ కొడుకులపై ఓ కుటుంబం హత్యాయత్నం

తల్లి అక్కడికక్కడే మృతి.. కొడుకు పరిస్థితి విషమం

 మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి

అమలాపురం టౌన్‌(తూర్పుగోదావరి): రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ మహిళను హతమార్చేలా చేశాయి. ఓ కుటుంబంపై ప్రత్యర్థి కుటుంబం మారణాయుధాలతో చేసిన హత్యాకాండలో తల్లి అక్కడిక్కడే ప్రాణాలు వదిలితే ఆమె కొడుకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి కొండ్రు దుర్గ (45) ఘటనా స్థలంలోనే హత్యకు గురైతే కొడుకు రమేష్‌ను కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. అమలాపురం రూరల్‌ మండలం సమనస గ్రామంలో కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథంలో ఈ హత్య శుక్రవారం సాయంత్రం అమలాపురం ఎన్టీఆర్‌ మార్గ్‌లో జరిగింది. అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, సమనస గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

కోటేశ్వరరావు, చిరంజీవి ఇళ్లు సమనస గ్రామంలో ఎదురెదురుగా ఉంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య గతం నుంచి వివాదాలు, ఘర్షణలు జరుగుతుండడంతో కక్షలు బాగా బలపడిపోయాయి. ఈ క్రమంలో చిరంజీవి కొడుకు విజయ్‌ సమనస గ్రామంలోనే ప్రత్యర్థి కోటేశ్వరరావుపై మారణాయుధంతో దాడి చేయబోయాడు. కోటేశ్వరరావు కూడా తిరగబడినప్పటికీ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ సమాచారాన్ని విజయ్‌ తన తండ్రి చిరంజీవికి ఫోన్‌ చేసి కోటేశ్వరరావుపై నేను దాడి చేస్తే పారిపోయాడు. కోటేశ్వరరావు భార్య దుర్గ, కొడుకు రమేష్‌ అమలాపురం నుంచి కొద్దిసేపట్లో బయలుదేరి సమనస వస్తారు. మనం దారి కాసి దాడి చేయాలని చెప్పాడు. దీంతో చిరంజీవి, అతని కొడుకులు విజయ్, నవీన్, చిరంజీవి భార్య బేబి వారికున్న మినీ వ్యాన్‌లో అమలాపురం మారణాయుధాలతో బయలుదేరారు. ఇదే సమయంలో కోటేశ్వరరావు తన కుమారుడు రమేష్‌కు ఫోన్‌ చేసి.. తల్లి దుర్గను మోటారు సైకిల్‌పై తీసుకురావాలని చెప్పడంతో తల్లీ కొడుకు ఇంటికి బయలు దేరారు. 

పని ముగించుకుని బయలుదేరిన కొద్దిసేపటికే దాడి..హత్య 
కొండ్రు మంగ అమలాపురం డీఎస్పీ కార్యాలయం వెనక ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రోజూ సమనస నుంచి పనికి వస్తుంది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం పనిముగించుకుని తన కొడుకు రమేష్‌తో తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి కుటుంబం చిరంజీవి, ఆయన కొడుకులు అమలాపురం వచ్చి ఎన్టీఆర్‌ మార్గ్‌పై మారణాయుధాలతో కాచుకుని ఉన్నారు. తల్లిని మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని కొడుకు రమేష్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డుపైకి రాగానే చిరంజీవి కుటుంబీకులు కత్తులతో వారిపై ఒక్కసారిగా దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారు.

తల్లి దుర్గపై కత్తి వేట్లు ఎక్కువగా పడి అక్కడికక్కడే కుప్పకూలి పోయి రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది. కొడుకు రమేష్‌పై కత్తులతో వేట్లు వేశారు. దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి చిరంజీవి కుటుంబీకులు పరారయ్యారు. అయితే తీవ్రంగా గాయపడ్డ   రమేష్‌ను తక్షణమే స్థానికులు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అతను అపస్మారక స్థితిలో వైద్యం పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ రమేష్‌ స్పృహలోకి వస్తే ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ సురేష్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సమనసలో చిరంజీవి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి సీఐ సురేష్‌బాబు, ఎస్సై దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ వై.మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

చదవండి: Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి
ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న కరోనా భయం

మరిన్ని వార్తలు