చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి..

29 Aug, 2021 02:59 IST|Sakshi
మాణిక్యరావు(ఫైల్‌) 

ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య 

వివాహేతర సంబంధమే కారణం.. 

నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఘటన

మన్ననూర్‌/షాబాద్‌: ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన నల్లమలలో ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం కేశగూడెంకు చెందిన మాణిక్యరావు(35), శోభారాణికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలసి ఆమె పక్కా ప్లాన్‌ వేసింది. ఆరోగ్యం బాగా లేదని ఈ నెల 13న భర్తతో కలసి షాద్‌నగర్‌ ఆస్పత్రికి వచ్చింది. ఆ తర్వాత మామిడిపల్లిలో కల్లు తాగి.. అటవీ ప్రాంతంగా ఉన్న షాబాద్‌ మండలం తుమ్మన్‌గూడ గ్రామం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

అప్పటికే యాదయ్యకు ఫోన్‌ చేయడంతో అటవీ ప్రాంతం మార్గమధ్యలోకి వచ్చాడు. ఇద్దరూ కలసి మాణిక్యరావును కుమ్మరిగూడ ప్రాంత చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి చున్నీని మెడకు బిగించి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే అటవీప్రాంతంలో ఉంచి వచ్చారు. 14వ తేదీ తెల్లవారుజామున ఓ కారును అద్దెకు తీసుకుని మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి కారు డిక్కీలో వేసుకున్నారు. వీరికి యాదయ్య స్నేహితులు శ్రీశైలం, వినోద్‌ సహకరించారు. అమ్రాబాద్‌ మండలం శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన రహదారిలోని ఓ మూలమలుపు వద్ద రోడ్డుపై నుంచి మృతదేహాన్ని లోయలోకి విసిరేశారు. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని ఈ నెల 24న బంధువులతో కలసి ఆమె షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భార్య శోభారాణి, ఆమె ప్రియుడి యాదయ్యపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రెండు వారాల క్రితం హత్య జరగడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. 

మరిన్ని వార్తలు