తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్‌.. 

4 May, 2021 13:19 IST|Sakshi
మహిళ మృతదేహం

మహిళను హత్యచేసి పరారీ

మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లిన వైనం 

బల్లికురవ (ప్రకాశం జిల్లా): గ్రానైట్‌ క్వారీలో పనిచేసేందుకు ఒడిశా నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని కార్మికుడు దారుణానికి పాల్పడ్డాడు. తనకు తోడుగా వచ్చి తనతో పాటే ఉంటున్న గుర్తుతెలియని మహిళను హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో నాలుగు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ గ్రానైట్‌ క్వారీలో పనిచేసేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు వచ్చాడు.

ఆ క్వారీకి సమీపంలోని చెన్నుపల్లి గ్రామంలో వల్లా చినవీరాంజనేయులు ఇంటిని అద్దెకు తీసుకుని తన వెంట తెచ్చుకున్న మహిళతో కాపురం పెట్టాడు. గత గురువారం ఆమెను హత్య చేసి ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. ఐదు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి వీఆర్వో రాంబాబుకు సమాచారం అందించారు. వీఆర్వో పోలీసులకు తెలియజేయడంతో దర్శి డీఎస్పీ ప్రకాశరావు, అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, బల్లికురవ ఎస్సై శివనాంచారయ్య సోమవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇంటి తలుపులు తెరిచి చూడటంతో సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహం పురుగులు పట్టి రక్తపు మడుగులో ఉంది. ఇంటి యజమాని, పరిసర గృహాల వారిని పోలీసులు విచారించారు. ఒడిశా నుంచి వచ్చానని, క్వారీలో పనిచేస్తున్నానని, కాపురం ఉంటానని చెప్పడంతో ఇల్లు అద్దెకు ఇచ్చానని ఆ ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. అంతకుమించి వారి వివరాలేమీ తనకు తెలియదని చెప్పాడు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

చదవండి: పెట్రోల్‌ పోసి ఒంటికి నిప్పు, ప్రేమ వ్యవహారమే కారణమా? 
యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు