మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని

3 Aug, 2022 09:24 IST|Sakshi
  న్యాయం కోసం బాధితురాలి వేడుకోలు ఫారూఖ్‌–దుర్గ పెళ్లి ఫొటో 

సాక్షి, కరీంనగర్‌: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా వద్దని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది.

ఆ సమయంలో అక్కడే ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్‌ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

ఫారూఖ్‌ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్‌ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది.


నిరసన తెలుపుతున్న దుర్గ

మొదటి భార్యతో కలిసి వేధింపులు..
ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్‌ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. 

అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని..
ఫారూఖ్‌ ఇటీవల కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్‌ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
చదవండి: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు

మరిన్ని వార్తలు