ఉమెన్స్‌ బ్యూటీ పార్లర్‌.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో..

23 Jan, 2022 07:35 IST|Sakshi
చిట్టీల పేరుతో జనాన్ని మోసం చేసిన జయలక్ష్మి

సాక్షి, అనంతపురం: అనంతపురంలోని హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్న జయలక్ష్మి సాయినగర్‌ మొదటి క్రాస్‌లో ఉమెన్స్‌ బ్యూటీ పార్లర్‌ నిర్వహించేది. తన వద్దకు వచ్చే మహిళలకు మంచి మాటలు చెప్పి వారితో చిట్టీలు వేయించేది. ఇలా రూ.20 కోట్లకుపైగా వసూలు చేసింది. చిట్టీల గడువు ముగిసినప్పటికీ .. డబ్బులు మాత్రం ఇచ్చేది కాదు. బాధితులు ఒత్తిడి తేగా నేడు, రేపూ అంటూ తప్పించుకుని తిరిగింది. మూడు రోజుల కిందట ఇల్లు ఖాళీ చేసి.. సామగ్రితో వెళ్లిపోవాలని ప్లాన్‌ వేసింది. ఇది తెలుసుకున్న ముగ్గురు బాధితులు పంగల్‌రోడ్డు వద్ద కాపుకాసి సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో జయలక్ష్మి ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఆరా తీయగా.. చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది.

వరుస కట్టిన బాధితులు 
జయలక్ష్మి బాధితులు ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు వరుస కట్టారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు మోసపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. శనివారం ఒక్క రోజే 70 మంది బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. చిట్టీ డబ్బు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఓ దశలో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న జయలక్ష్మిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆమెకు రక్షణ కలి్పంచారు.  జయలక్ష్మి నగర పరిధిలో నివాసం ఉంటుండటంతో కేసును అక్కడికి బదిలీ చేయాలని నిర్ణయించారు.

ఇది వరకే కేసులు కట్టాం 
చిట్టీల డబ్బులు చెల్లించని జయలక్ష్మిపై బాధితుల ఫిర్యాదుల మేరకు గతంలోనే వన్‌టౌన్, టూటౌన్‌ పీఎస్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె చిట్టీల డబ్బులు ఎగ్గొట్టిందని బాధితులు  ఇటుకలపల్లి, అనంతపురం టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. డబ్బు చెల్లింపులకు సంబంధించి జయలక్ష్మి బాండ్లు ఇచ్చినట్లు తెల్సింది. ఈ వ్యవహారం సివిల్‌ పరిధిలోకి వస్తుంది. బాధితులు కోర్టును ఆశ్రయించాలి. 
– ప్రసాదరెడ్డి, అనంతపురం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ   

మరిన్ని వార్తలు