నమ్మించి ‌సర్వం దోచేసింది.. ఆ తర్వాత ‌‌

18 Mar, 2021 06:55 IST|Sakshi

మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుని నుంచి లక్షలాది రూపాయల మేర నగదును, ఆభరణాలను దోచుకున్న కిలాడీ లేడీని మైసూరు మేటగళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఆంధ్రహళ్లి రెండో ప్రధాన రహదారిలో నివాసం ఉండే మేఘ అలియాస్‌ బిందుగౌడ (25) నిందితురాలు. ఈమె టెన్త్‌ చదివింది. ఫేస్‌బుక్‌లో చిన్నుగౌడ పేరుతో ఖాతా తెరిచి రవి అనే వ్యక్తితో స్నేహం ప్రారంభించింది. తన పేరు బిందు గౌడ అని చెబుతూ అందమైన ఒక అమ్మాయి ఫోటోలను రవికి పంపింది.

తమకు మైసూరులో రెండు పెట్రోల్‌ బంకులు, బార్‌ ఉన్నాయని, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని రవిని కోరింది. నీ పుట్టిన రోజుకు రూ. 45 లక్షల ఫార్చ్యూనర్‌ కారు బహుమతిగా ఇస్తానని, అందుకు ఒక రూ. లక్ష తక్కువగా ఉన్నాయని, ఆ డబ్బును తన స్నేహితునికి ఇచ్చి పంపాలని మాయమాటలు చెప్పింది. మీ అమ్మ మెడలోని గొలుసు చాలా అందంగా ఉందని, తనకెంతో నచ్చిందని, దాన్ని అదే స్నేహితునికి ఇచ్చి పంపిస్తే అదేమాదిరి డిజైన్‌ను తయారు చేయించి తిరిగి ఇచ్చేస్తానని మభ్యపెట్టింది.  

అన్నీ ఇచ్చాక ఫోన్‌ స్విచ్చాఫ్‌  
మేఘ మాయమాటలను నమ్మిన రవి ఆమె చెప్పినట్లుగా అన్ని చేశాడు. నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చిన తర్వాత ఫోన్‌ చేస్తే మోసగత్తె మొబైల్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో మేటగళ్లి పోలీసు స్టేషన్‌ను బాధితుడు రవి ఆశ్రయించాడు,. ఈ కేసును విచారించిన పోలీసులు బిందుగౌడను అరెస్టు చేశారు. విచారణ చేయగా, పెద్ద చీటర్‌ అని, 2018లో యోగానంద నుంచి రూ. 15 లక్షలు, శ్రీనివాస్‌ నుంచి రూ. 9.70 లక్షలను ఏమార్చి దోచుకున్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు