విదేశీ వధువు.. రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు

8 Dec, 2020 08:08 IST|Sakshi

నగరంలో మరో మాట్రిమోనియల్‌ ఫ్రాడ్‌ 

ఈసారి టార్గెట్‌గా మారింది ‘పెళ్లి కొడుకు’ 

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ వరులుగా మాట్రిమోనియల్‌ సైట్స్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం.. యువతులు, రెండో పెళ్లి చేసుకునే మహిళల్ని ఆకర్షించడం.. వారిని టార్గెట్‌గా చేసుకుని గిఫ్ట్‌ల పేరుతో గాలం వేయడం.. కస్టమ్స్‌ అధికారులుగా కాల్‌ చేసి అందినకాడికి దండుకోవడం.. సిటీలో ఇలాంటి కేసులు తరచుగా చూస్తున్నాం. అయితే ఈసారి సీన్‌ రివర్స్‌ అయింది. విదేశీ వధువుగా రిజిస్టర్‌ చేసుకున్న ఓ మహిళ వల్లో పడిన నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కథనం ప్రకారం..  

⇔ నగరంలోని బర్కత్‌పురా ప్రాంతానికి ఓ వ్యక్తి ఉన్నత విద్యనభ్యసించారు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొన్నాళ్ల క్రితం సంగం.కామ్‌ అనే మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈయనకు ఇటీవల రీటాగా చెప్పుకున్న, ఆ పేరుతో రిజిస్టర్‌ చేసుకున్న యువతితో ఈ సైట్‌ ద్వారా పరిచయమైంది.  

⇔ తాను అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నానంటూ ఆమె చాటింగ్‌లో చెప్పింది. ఇలా వీరి పరిచయం పెరిగిన తర్వాత సదరు రీటా నగర వాసి దగ్గర పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చింది. హఠాత్తుగా ఓ రోజు మన పరిచయానికి గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ సందేశం పంపింది. ఆపై రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు నగర వాసికి కాల్‌ చేశారు.  

⇔ అమెరికా నుంచి మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చిందని చెప్పారు. అందులో ఖరీదైన గిఫ్ట్‌లతో పాటు కొన్ని డాలర్లు సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని హైదరాబాద్‌కు పంపాలంటే కస్టమ్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరని చెప్పారు. దానికోసం కొన్ని ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందంటూ దఫదఫాలుగా బాధితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు.  

⇔ చివరికి తాను మోసపోయాననే విషయం గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రీటాగా చెప్పుకున్న మహిళ +11తో మొదలయ్యే నంబర్‌తో వాట్సాప్‌ చాటింగ్‌ చేసింది. బాధితుడు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలన్నీ ఢిల్లీలో, సోనియా శర్మ పేరుతో ఉన్నాయి. వీటి ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు