నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే

18 Aug, 2020 09:42 IST|Sakshi
ఫైల్ ఫోటో

అత్యాచార కేసులో బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి

 బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటున్న బాధితురాలు

 బ్లాక్ మెయిల్  కేసు పెట్టిన ఎమ్మెల్యే భార్య

డెహ్రాడూన్: బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్  సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ కేసు నమోదు చేయడం కలకలం రేపింది. తన భర్తపై అత్యాచారం కేసు పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తామని బెదిరించిందనీ, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ ఎమ్మెల్యే భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం  చోటుచేసుకుంది. 

తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే  పొరుగున ఉండే తాను 2016లో తన తల్లి అనారోగ్యానికి సంబంధించి తొలిసారి అతణ్ని కలిశానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2016 - 2018 మధ్య తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, తన పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు భర్త దగ్గరకు వెళ్లొద్దని ఆదేశించాడని, ఆయన ఒత్తిడి కారణంగానే తన అత్తమామలు,భర్తపై తప్పుడు కేసులు పెట్టానని చెప్పారు. దీంతో విషయాన్ని భర్తకు వివరించడంతో అతను తనతో తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఫలితంగా తను ఈ ఏడాది మే18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. 

అటు తన భర్త రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని, తన కొడుకును చంపేస్తానంటూ బెదిరించిందని నేగి భార్య ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన డెహ్రాడూన్ డీఐజీ అశోక్ కుమార్ బ్లాక్ మెయిల్ ఆరోపణలపై మహిళ, తల్లి తదితరులపై  కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలను నిరాధారమైనవంటూ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులుగా మారడానికి ఒక ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. త్వరలోనే నిజాలు బహిర్గతమవుతాయన్నారు. పోలీసుల దర్యాప్తు ఫలితాల ఆధారంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ ప్రకటించారు. దీనిపై రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఎందుకు ఫిర్యాదు చేసిందనేది కూడా తేలాల్సి ఉందన్నారు.  దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్‌  మండిపడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు