అత్తతో సెల్‌ఫోన్‌ గొడవ.. క్షణికావేశంతో పిల్లలను బావిలో తోసి..

30 Aug, 2021 21:01 IST|Sakshi

ఛత్తర్‌పూర్‌: అత్త, కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తూనే ఉంటాయి. ఆ గొడవలను పరిష్కరించుకొని మళ్లీ కలిపోతుంటారు. కానీ, అత్త మీద కోపంతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి, తను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులను పశువులు మేపడానికి తన వెంట తీసుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ బావిలో తన ఇద్దరు పిల్లలను తోసేసింది. అనంతరం తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

చదవండి: హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి

బావిలో పడిన ఇద్దరు చిన్నారుల్లో 10 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో చిన్నారి బావి లోపలి అంచుల్లో ఉన్న బండ రాళ్ల మధ్యలో ఇరుక్కొవటంతో బ్రతికి బయటపడింది. కొన్ని రోజులుగా అత్త, కోడళ్ల మధ్య మొబైల్‌ ఫోన్‌కు సంబంధించి గొడవ జరుగుతుందని, శనివారం ఆ మహిళ అత్త తన నుంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.     

చదవండి: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్‌లో దాచాడు!

మరిన్ని వార్తలు