Hyderabad Crime: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’

4 Aug, 2022 15:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్‌కు చెందిన ఖాజా మోయియుద్దీన్‌ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్‌ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్‌ సుల్తాన్‌ పటేల్‌తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్‌తో పాటు అతని తల్లి కూడా వేధించారు.

వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్‌ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్‌ షాహిన్‌నగర్‌ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి  సుల్తాన్‌ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్‌ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.   

గన్‌తో బెదిరించేవాడు.. 
తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్‌ డైరీలో రాసింది. గన్‌తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు