నువ్వు చచ్చిపోతే నా కొడుక్కి మూడో పెళ్లి చేస్తా...

1 Oct, 2022 07:55 IST|Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) : నా చావుకు.. భర్త, అత్తమామలే కారణం. భర్త, అత్త అసలు మనుషులే కాదు. ఎన్నో రకాలుగా హింసించారు. నేను చనిపోతే వాళ్లు నా పిల్లలను రోడ్డున వదిలేస్తారు.. అందుకే వారినీ నాతో పాటు తీసుకుపోతున్నా.. తన ఆత్మహత్యకు దారితీసిన నేపథ్యాన్ని ఓ వివాహిత ఇలా సూసైడ్‌ నోట్‌లో వివరించడం అందరికీ కంటతడి పెట్టించింది. వివాహితతో పాటు ఏడాది పసికందు అక్షిత శుక్రవారం ఉదయం మృతి చెందగా.. 4 ఏళ్ల తుషిత మృత్యువుతో పోరాడుతోంది.  అయితే వీరి మృతికి భర్త మోహన్‌కృష్ణతో పాటు అత్త రామలక్ష్మిగా కుటుంబ సభ్యులు, పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై శైలజ తల్లి అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పెళ్లైనప్పటి నుంచీ వేధింపులే..: 
ఎంవీపీకాలనీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కృష్ణా కళాశాల సమీపంలో సంపంగి మోహన్‌ కృష్ణ తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. 2017లో నగరానికి చెందిన సంపంగి మోహన్‌కృష్ణ.. రాజమండ్రి సమీపంలోని నాతవరానికి చెందిన  శైలజ (34)ను  వివాహం చేసుకున్నాడు. మోహన్‌కృష్ణకు ఇది రెండో వివాహం. అతను నగరంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మార్కెటింగ్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లైన మరుసటిరోజు నుంచి శైలజను అదనపుకట్నం కోసం మోహన్‌కృష్ణ అతని తల్లి రామలక్ష్మి వేధింపులకు గురిచేసే వారు. అత్త సూటిపోటి మాటలతో హింసించడంతో పాటు భర్త రోజూ తాగి వచ్చి కొట్టేవాడు. దీనికి తోడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. తనకు బాబు కావాలని వేధించేవాడు. నువ్వు చచ్చిపోతే తన కొడుక్కి మూడో పెళ్లి చెస్తానంటూ అత్త వేధించేది. 

దీంతో పాటు సారి విషయంలోనూ శైలజకు వేధింపులు అధికమయ్యాయి. వివాహం సమయంలో రూ. 5 లక్షల కట్నంతో పాటు రూ.40 వేలు ఆడపడుచు కట్నం, 10 తులాల బంగారు శైలజ పుట్టింటివాళ్లు పెట్టారు. ఇవి సరిపోని మోహన్‌కృష్ణ, అత్త రామలక్ష్మి రూ.2లక్షలు సారి తేవాలని శైలజను టార్చర్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు తన పరిస్థితిని చెప్పుకుని శైలజ బాధపడేది. దీంతో కుటుంబ సభ్యులు సారి నిమిత్తం రూ.50 వేలు మోహన్‌కృష్ణకు అందజేశారు. అయిప్పటికీ మిగతా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. చాలా సార్లు చచ్చిపోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులకు వివరించింది. 

పిల్లలతో పాటు ఆత్మహత్యాయత్నం
వేధింపులు తట్టుకోలేని శైలజ తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 29న పిల్లలకు దోమలు స్ప్రై తాగించింది. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ విషయాన్ని గమనించిన మోహన్‌కృష్ణ, అతని తల్లి రాత్రి 8 గంటల సమయంలో శైలజను పిల్లలను మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెడికవర్‌లో చికిత్స పొందుతూ శైలజ, చిన్న కూతురు అక్షితలు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. పెద్ద కూతురు తుషిత(4) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. అయితే శైలజ, పాప మృతి సమాచారం తెలు సుకున్న మోహన్‌కృష్ణ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు శైలజ, అక్షితల మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్‌కృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు