పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో

21 May, 2022 12:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది.

సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్‌ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్‌ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు