కూతురు కులాంతర వివాహం.. భవిష్యత్‌పై బెంగతో..

1 Jun, 2021 07:57 IST|Sakshi
వరలక్ష్మి(ఫైల్‌)

సాక్షి, జన్నారం(ఖానాపూర్‌): కులాంతర వివాహం చేసుకున్న కూతురిని అల్లుడు తీసుకెళ్లడం లేదని, కూతురి భవిష్యత్‌పై బెంగతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని లింగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తానాజీనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యపల్లి గ్రామానికి చెందిన గూడ సత్తయ్య, వరలక్ష్మి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు.

కూతురు నాగలక్ష్మి ఆరు నెలల క్రితం రోటిగూడకు చెందిన వెంకటేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొద్దిరోజులకే ఆమెను ఇంట్లో వదిలి వెళ్లిన అల్లుడు తిరిగి తీసుకెళ్లడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి(48) ఆదివారం రాత్రి ఇంటి పక్క ఉరేసుకుంది. మృతురాలి భర్త సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. 

స్థల వివాదంలో నిండు ప్రాణం బలి
సాక్షి, సిరికొండ(బోథ్‌): చిన్న స్థల వివాదం చిలికిచిలికీ గాలివానగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాథోడ్‌ ఉమ్మజీ(32), రాథోడ్‌ మహదులు ఇద్దరు వరుసకు బాబాయి, కొడుకులు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. రాథోడ్‌ మహదు మూడు రోజుల క్రితం మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాడు.

కాగా ఈ స్థలంపై ఇరు కుటుంబాలు గొడవకు దిగాయి. ఆదివారం రాత్రి రాథోడ్‌ మహదు, కుటుంబ సభ్యులతో కలిసి రాథోడ్‌ ఉమ్మజీపై దాడి చేయగా ఉమ్మజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాథోడ్‌ మహదు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్‌ అన్నారు. ఉమ్మజీకి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, రెండు నెలల మగ కవల పిల్లలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు