ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో

4 Sep, 2022 14:03 IST|Sakshi
అనూష(ఫైల్‌)  

సాక్షి, మహబూబాబాద్‌ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్‌తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్‌ శేఖర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈక్రమంలో శేఖర్‌ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్‌ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు.

దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com  

మరిన్ని వార్తలు