లైంగికదాడి చేయబోయాడు; కోలుకోలేని దెబ్బకొట్టింది!

20 Mar, 2021 15:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: తనపై అత్యాచారం చేయబోయిన వ్యక్తికి కోలుకోలేని షాకిచ్చింది ఓ మహిళ. కొడవలితో అతడి జననేంద్రియాలు కోసేసింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.  మధ్యప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకున్న ఆ ఘటన వివరాలు.. సిద్ధి జిల్లాలోని ఉమరిహా గ్రామానికి చెందిన మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. అయినప్పటికీ, అతడు మరింతగా రెచ్చిపోవడంతో ఇంట్లో ఉన్న కొడవలితో అతడిపై దాడి చేయగా, జననేంద్రియాలు కట్‌ అయిపోయాయి. అనంతరం పోలీసుస్టేషనుకు వెళ్లి సదరు మహిళ, అతడిపై ఫిర్యాదు చేసింది.

ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన జరిగిన సమయంలో మహిళ, ఆమె పదమూడేళ్ల కొడుకు మాత్రమే ఇంట్లో ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తి వారింట్లో చొరబడటంతో దొంగ అనుకుని, ఆ బాలుడు పారిపోగా, మహిళ అతడిని బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో అతడు లైంగికదాడికి యత్నించగా మంచం కింద ఉన్న కొడవలి తీసి అతడిపై దాడి చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీస్‌స్టేషనుకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఇక ఆ వ్యక్తి సైతం, తనను గాయపరిచినందుకు మహిళపై ఫిర్యాదు చేశాడు. ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టాం’’ అని తెలిపారు. 

చదవండి: యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు