సరదాగా కుటుంబంతో అత్తవారింటికి.. అంతలో దారుణం

25 Nov, 2021 10:28 IST|Sakshi
ప్రమాదంలో గాయపడిన పిల్లలు

బైక్‌ను ఢీకొట్టడంతో మహిళ మృతి  

ఇద్దరి పిల్లలకు గాయాలు  

ఏలేశ్వరం (తూర్పుగోదావరి): కుటుంబసమేతంగా మోటార్‌ సైకిల్‌పై తన అత్తవారి ఊరు బయలు దేరిన అతడికి రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కళ్లెదుటే భార్యను కోల్పోయి, క్షతగాత్రులైన పిల్లలను చూసి అతడు బోరున విలపించాడు. ఏలేశ్వరం మండల పరిధిలోని యర్రవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఏరుకొండ గ్రామానికి చెందిన పెరాపు సత్యనారాయణ తన అత్తవారి ఊరు పశ్చి మగోదావరి జిల్లా పొలమూరులో సెలూన్‌ షాపు నడుపుతున్నాడు.

భార్య కల్యాణి (26), ఏడేళ్ల కుమారుడు విష్ణువర్దన్, ఐదేళ్ల కుమారై లాస్యశ్రీతో కలిసి సొంతూరు ఏరుకొండ వెళ్లాడు. అక్కడి నుంచి పొలమూరు వెళ్లేందుకు ఉదయం బైక్‌పై భార్యాపిల్లలతో బయలుదేరాడు. మార్గమధ్యంలో యర్రవరం వద్ద వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్‌ బస్సు వారిని ఢీకొట్టింది. దీంతో కల్యాణి అక్కడికక్కడే మృతిచెందింది. సత్యనారాయణ, ఇద్దరు పిల్లలు గాయపడగా వారిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్సై సుబ్బిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది

మరిన్ని వార్తలు