టీకా వేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. కుమారుడి కళ్లెదుటే తల్లి మృతి

11 Jul, 2021 11:04 IST|Sakshi
ఘటనా స్థలంలో తల్లి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న రాజు

కుమారుడి ఎదుటే తల్లి దుర్మరణం

వ్యాక్సిన్‌ వేయించుకుని వెళ్తుండగా ప్రమాదం

రామచంద్రపురం రూరల్‌: లే అమ్మా.. ఇంటి కెళ్దాం.. దగ్గరికి వచ్చేశాం.. అంటూ తల్లి మృతదేహం వద్ద కుమారుడి రోదన చూపరులను కంటతడి పెట్టించింది.. తల్లికి కరోనా వ్యాక్సిన్‌ వేయించి ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగి, కుమారుడి కళ్లెదుటే ఆ మాతృమూర్తి ప్రాణాలు విడిచింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రపురం రూరల్‌లోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన ఉప్పు అనసూయ (53) శనివారం ఇసుక లారీ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. తన కుమారుడు ఉప్పు రాజుతో కలసి ద్రాక్షారామ వెళ్లి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. తిరిగి తమ ఇంటికి ఐదు నిమిషాల్లో చేరుతామనగా మృత్యువు లారీ రూపంలో వచ్చి ఆమె ప్రాణాలు హరించింది.

ఎదురుగా లారీ వస్తుండటంతో రాజు తాను నడుపుతున్న స్కూటర్‌ను రోడ్డు పక్కకు ఆపేశాడు. వీరి పక్క నుంచి డ్రైవర్‌ వేగంగా లారీని నడపడంతో లారీ అనసూయ తలను బలంగా ఢీకొట్టింది. రాజు పక్కకు పడిపోయాడు. అతను లేచి చూసేసరికి తల్లి చనిపోయి ఉంది. ఆమె మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కుమారుడు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. సంఘటనా స్థలానికి ద్రాక్షారామ ఎస్సై ఎస్‌.తులసీరామ్‌ చేరుకుని అనసూయ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు