కడదాకా కలిసుందామనుకున్నారు.. కానీ అంతలోనే..

24 Jul, 2021 18:45 IST|Sakshi
భర్త, కుమార్తెతో షేక్‌ యాస్మిన్‌ (ఫైల్‌)  

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు 

డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగే కారణం

నగరంలో తెల్లవారుజామున ఘటన

వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. తోడూనీడలా కడదాకా కలిసుందామనుకున్నారు. కష్టపడి బంగారు భవిష్యత్‌కు బాటలేసుకున్నారు. ఇద్దరికి ముగ్గురయ్యారు. కళ్లెదుటే ‘ప్రతి రూపం’ బుడిబుడినడకలు వేస్తుంటే మురిసిపోయారు. కానీ కన్నకూతురుకు నలతగా ఉండడంతో ఆ తల్లి కలత చెందింది. మందులు తెచ్చేకి వెళ్లింది. అంతలోనే కారు రూపంలో మృత్యువు కబళించింది. పదినిమిషాల్లో ఇంటికి చేరాల్సిన ఆమె..అనంత లోకానికి వెళ్లడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ హృదయ విదారక ఘటనతో అనంతపురం శ్రీనివాసనగర్‌లోని పెద్దముత్యాలమ్మ కాలనీ దుఖః సాగరంలో మునిగింది. 

అనంతపురం క్రైం: రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందింది. ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాఫిక్‌ ఎస్‌ఐ కానిగ సురేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్‌ మండలం నర్సినాయనికుంటకు చెందిన జ్వాలాపురం జగదీష్‌ పోస్ట్‌మన్‌. నగరానికి చెందిన షేక్‌ యాస్మిన్‌ (29) ఓ ప్రైవేట్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. వీరిద్దరూ ప్రేమించుకొని, నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. నగరంలోని శ్రీనివాసనగర్‌ పెద్దముత్యాలమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు.

వీరికి రెండేళ్ల కూతురు జైనిక ఉంది. గురువారం రాత్రి కుమార్తెకు జలుబు చేయడంతో దంపతులిద్దరూ ఆవిరి పట్టించారు. అయినా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో మందులు తెద్దామని జగదీష్‌ సిద్ధమయ్యాడు. అయితే అతనికి జ్వరంగా ఉండటంతో ఇంట్లోనే ఉండి పాపను చూసుకొమ్మని చెప్పి యాస్మిన్‌ ద్విచక్రవాహనంపై బయల్దేరింది. చంద్ర ఆస్పత్రి సర్కిల్‌ దాటిన తర్వాత లక్ష్మీ విలాస్‌ ఏటీఎం వద్దకు రాగానే గుత్తి రోడ్డు నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. బైక్‌పై నుంచి ఎగిరిపడిన యాస్మిన్‌ను కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ దాసరి హేమచరణ్‌పై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు