వరకట్న వేధింపులకు మహిళ మృతి 

3 Sep, 2020 14:01 IST|Sakshi
కార్తీక, సతీష్‌కుమార్‌ పెళ్లి నాటి ఫొటో(ఫైల్‌)

విషం తాగి బలవన్మరణం

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

డీఎస్పీ విచారణ

పిచ్చాటూరు(చిత్తూరు జిల్లా): విషం తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన  మండలం అప్పంబట్టులో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల కథనం..గ్రామానికి చెందిన జయశంకర్‌ రెడ్డి, శెల్వి దంపతుల కుమార్తె కార్తీక (18)కు గ్రామంలోని భూపతమ్మ కుమారుడు సతీష్‌ కుమార్‌తో ఆరునెలల క్రితం వివాహమైంది. సోమవారం ఉదయం కార్తీక తన అత్తగారి ఇంట పురుగులు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం చెన్నైలోని యంజీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అదే రోజు సాయంత్రం  కార్తీక మరణించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు మృతురాలి తండ్రి  ఫిర్యాదు చేశారు. తొలుత సెక్షన్‌ 174 ప్రకారం కేసు నమోదు చేసి మృతదేహానికి యంజీఆర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

వేధింపుల వల్లే ఆత్మహత్య
తమ కుమార్తె వరకట్న వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని మృతుతాలి తల్లి శెల్వి మంగళవారం రాత్రి పిచ్చాటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు వరకట్నం కోసం అల్లుడు, వియ్యంకురాలు, పెద్ద మామ(సతీష్‌ కుమార్‌ పెద్దనాన్న) బాషా తరచూ వేధించే వారని, వీరి వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి వరకట్న కేసుగా మార్చి, సెక్షన్‌ 174ను 498(ఎ), 304(బి)గా మార్పు చేశారు. మృతురాలి భర్త, అత్త భూపతమ్మ, బాషాను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

రెండవసారి పోస్టుమార్టం
డీఎస్పీ విమలకుమారి బుధవారం ఉదయం పిచ్చాటూరు స్టేషన్‌కు చేరుకుని మృతురాలి బంధువులను విచారణ చేశారు. అనంతరం తహసీల్దారు టీవీ సుబ్రమణ్యం, డీఎస్‌పీ, సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్తీక మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు