పెళ్లి రోజే నూరేళ్లు.. పాలకూర కోసం వెళ్లి.. రోడ్డు దాటి వస్తుండగా..

16 May, 2022 12:48 IST|Sakshi

సాక్షి, నల్గొండ: పెళ్లిరోజు నాడే ఓ మహిళకు నిండు నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తాటిపాముల గ్రామానికి చెందిన రేణుక (28)కు తొండ గ్రామానికి చెందిన లోడె శేఖర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సంతానం. 

దైవ దర్శనానికి వెళ్లొద్దామనుకుని..
ఆదివారం శేఖర్, రేణుకదంపతుల పెళ్లిరోజు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నా రు. త్వరగా వంట పని పూర్తి చేసుకోవాలని రేణుక అనుకుంది. అందులో భాగంగానే ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి పాలకూర కొనుగోలు చేసింది. తిరిగి ఇంట్లోకి వస్తున్న క్రమంలో తొర్రూరు రోడ్డు వైపు నుంచి వేగంగా వచ్చిన సెప్టిక్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పెళ్లి రోజు వేడుకను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న ఆ కుటుంబంలో రేణుక మృతితో విషాదం అలుముకుంది. సమాచారం మే రకు పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త శేఖర్‌ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు