ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో చీరకొంగు చిక్కుకొని మహిళ దుర్మరణం

3 Nov, 2022 13:20 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన యంత్రాంగం.. రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, నల్గొండ: ధాన్యం తూర్పారపట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు చీర కొంగు చిక్కుకోవడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.. ఈ విషాదం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.

మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్‌ గ్రామానికి చెందిన మరాటి ఆండాలు (55) స్థానిక పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు రమావత్‌ జగన్‌కు చెందిన ధాన్యాన్ని తూర్పారట్టేందుకు కూలికి వెళ్లింది. కాగా తూర్పారపట్టే యంత్రంలో ధాన్యం పోస్తుండగా ప్రమాదవశాత్తు వేగంగా తిరుగుతున్న రాడ్‌కు ఆండాలు చీర కొంగు చుట్టుకొని కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆండాలు కుడికాలు విరగడంతో పాటు రొమ్ము భాగంలో బలమైన గాయాలయ్యాయి.

గమనించిన రైతు జగన్‌.. అండాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి రైతుల సహాయంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి కారులో తరలించారు. కాగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆండాలు అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు. 

చదవండి: భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్‌ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?

మరిన్ని వార్తలు