కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా..

8 Nov, 2022 01:49 IST|Sakshi
తల్లి స్వరూపకు స్వీట్‌ తినిపిస్తున్న  కొడుకు విజయ్‌గౌడ్‌ (ఫైల్‌ )  

గుండెపోటుతో మరణం 

ఆర్థిక ఇబ్బందులతో విజయ్‌గౌడ్‌ ఆత్మహత్య  

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో విషాదం

నర్సాపూర్‌ రూరల్‌: ఆర్థిక ఇబ్బందులతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది  తట్టుకోలేని తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం ఖాజీపేటలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఖాజీపేటకు చెందిన ముచ్చర్ల విజయ్‌గౌడ్‌ (28) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం సాయంత్రం తన డెయిరీ ఫామ్‌ దగ్గర గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన చుట్టు పక్కలవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హైదరాబాద్, సూరారంలోని నారాయణ ఆస్పత్రికి సమీపిస్తుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

విజయ్‌గౌడ్‌ చనిపోయిన విషయాన్ని రాత్రి 11 గంటల సమయంలో తల్లి ముచ్చర్ల స్వరూప (55)కు చెప్పారు. గుండెలు అవిసేలా రోదించిన ఆ తల్లి.. రాత్రి 2 గంటల సమయంలో గుండెపోటు తో ఇంట్లోనే ప్రాణాలొదిలింది. ఒకే రోజు తల్లీకొ డుకు మృతి చెందడంతో ఖాజీపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, సుధాకర్‌రెడ్డి, మదన్‌లతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అప్పులబాధతో ఆత్మహత్య..
ముచ్చర్ల నర్సింహగౌడ్, స్వరూప దంపతులకు ఇద్దరు కొడుకులు. ఉమ్మడి కుటుంబం. పెద్ద కొడు కు శేఖర్‌గౌడ్‌ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడైన విజయ్‌గౌడ్‌ అప్పు చేసి కొన్ని పాడి గేదెలు కొనుగోలు చేసి డెయిరీ ఫామ్‌ నిర్వహి స్తున్నాడు. ఇటీవల కొన్ని గేదెలు అనారోగ్యంతో మృతి చెందాయి. చేసిన అప్పులతో పాటు కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురై విజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య శిరీష, మూడేళ్ల కొడుకున్నాడు. శిరీష ప్రస్తుతం 8 నెలల గర్భిణి.  

మరిన్ని వార్తలు