Extramarital affair: పెళ్లికాకుండానే తల్లయిన యువతి

29 Mar, 2022 08:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏటూరునాగారం(వరంగల్) : పెళ్లయిన వ్యక్తితో ఓ యువతి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి కాకుండానే ఆ యువతి తల్లి అయింది. పండంటి పాపకు జన్మనిచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా దత్తత పేరుతో ఆ పాపను మరో మహిళకు అప్పగించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ తల్లికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పాపను అప్పగించారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. మండలానికి చెందిన ఓ యువతికి బూటారం గ్రామానికి చెందిన ఆత్యూరి రవీందర్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఆ యువతి తల్లి అయింది.

 పది నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. రవీందర్‌కు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిడ్డకు కారణమైన రవీందర్‌ను ఆ యువతి నిలదీస్తే గొడవపడి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి తన పాపను గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మౌనికకు పిల్ల లు లేకపోవడంతో పాపను ఇచ్చింది. డెలివరీకి అయ్యే ఖర్చును మౌనిక భరించి పదిరోజుల పసిగుడ్డును దత్తత తీసుకుంటున్నట్లు అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. ఈ విషయం బయటపడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఆ యువతితోపాటు పసిపాపను దత్తత తీసుకున్న మౌనికను అదుపులోకి తీసుకుని విచారించారు. పసికందు దత్తతను చట్టబద్ధంగా చేసుకోవాలని యువతి కుటుంబ సభ్యులతోపాటు రవీందర్‌ను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశామని సీఐ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఆ శిశువును మళ్లీ తల్లికి అప్పగించారు. ఇంత జరుగుతున్న ఐసీడీఎస్, చైల్డ్‌లైన్‌ అధికారులు అటువైపు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు