పది రోజులకు ఒకసారి ప్రసాద్‌ ఇంటికి.. అనుమానాస్పద స్థితిలో..

24 May, 2022 17:27 IST|Sakshi
శిరీష(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత హత్యకు గురైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్‌(35) ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో గత ఆరు నెలలుగా ఓ గదిని అద్దెకు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. పలు చోట్ల కుక్‌గా పనిచేసే ప్రసాద్‌ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తుండేవాడు. కాగా శిరీష అనే మహిళ ప్రతి పది రోజులకు ఒకసారి ప్రసాద్‌ ఉంటున్న గదికి వచ్చి వెళ్తుండేది.

ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రసాద్‌ తాను ఉంటున్న గదికి పక్కనే ఉండే వారికి సోమవారం కాల్‌ చేసి తన గదిలో శిరీష చనిపోయిందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో అతడి గది వద్దకు వెళ్లగా తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభించింది. చుట్టు పక్కల పరిశీలించగా గోడపై రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో ఆమె తలను గోడకు కొట్టడంతో మృతి చెంది ఉండవచ్చని, రెండు, మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి)

ప్రసాద్‌ గదిలో లభ్యమైన మహిళ ఫొటో.. 
పోలీసులు నిందితుడిగా భావిస్తున్న ప్రసాద్‌ ఉంటున్న గదిలో తనిఖీలు చేపట్టగా మృతురాలి శిరీష ఫొటో లభ్యమైంది. ఓ ప్రణాళిక ప్రకారమే ఆమె ఫొటో ఉంచి ఉంటాడని పోలీసులు తెలుపుతున్నారు. కాగా శిరీషను కొందరు ప్రసాద్‌ భార్య అని చెబుతుండగా, మరికొందరు భార్య అయితే పది రోజులకోసారి ఎందుకు వస్తుందని పేర్కొంటున్నారు. అయితే ప్రసాద్‌తో సదరు మహిళకు ఉన్న సంబంధంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆమె ఎక్కడ ఉంటుందన్న విషయాలు సైతం ఎవరికి తెలియవని పోలీసులు పేర్కొంటున్నారు. అసలు ఎందుకు హత్య చేసి ఉంటాడు? హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ 
చేపడుతున్నారు. 

మరిన్ని వార్తలు