ఏడేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి

16 Feb, 2022 08:55 IST|Sakshi

సాక్షి, కుషాయిగూడ: వేర్వేరు ఘటనల్లో పలువురు అదృశ్యమైన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. ఓ ఘటనలో ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం కాగా, మరో ఘటనలో స్నేహితుడితో కలిసి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగి రాలేదు. 

పిల్లలతో కలిసి..  
కాప్రా, శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన పులి భాస్కర్‌రాజు ప్రైవేటు ఉద్యోగి. అతడికి ఏడేళ్ల క్రితం హైమవతి (26)తో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల హన్షిత్‌రాజ్, మూడున్నరేళ్ల గ్రీష్మ సంతానం. ఈ నెల 11న పిల్లలతో కలిసి అందరూ  లాలాపేట్‌లో హైమవతి అక్క ఇంటికి వెళ్లి 13న వచ్చారు. 14న ఉదయం భాస్కర్‌రాజు ఆఫీసుకు వెళ్లాడు. అదే రోజు హైమవతి ఇద్దరు పిల్లలతో కలిసి తిరుమలగిరి నాగదేవత ఆలయానికి వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

విహారయాత్రకు వెళ్లి.. 
కాప్రా, సైనిక్‌పురి, లేక్‌వ్యూ రెసిడెన్సీలో నివసించే షేక్‌ ప్రద్న్య సులేమాన్‌ (23), భర్త షేక్‌ సులేమాన్‌ ఇద్దరూ ఐటీ ఉద్యోగులే. వారికి ఓ పాప ఉంది. పుణెకు చెందిన తన భర్త స్నేహితుడు అవినాష్‌ శర్మతో కలిసి తమ కారులో గత నెల 28న టూర్‌కు బయలుదేరి కర్ణాటక చేరుకున్నారు. 30న అక్కడి నుంచి గోవాకు వెళ్లారు. అక్కడ జూమైకా కాబో వాబో బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌లో బస చేశారు.ఈ నెల 4న అవినాష్‌ అక్కడి నుంచి వెళ్లిపోగా సులేమాన్‌ 7న రెస్టారెంట్‌ ఖాళీ చేశాడు. తిరిగి వస్తున్నట్లు భార్యకు ఫోన్‌లో చెప్పిన సులేమాన్‌ ఇంటికి చేరుకోలేదు.

చివరగా ఈ నెల 8న తన భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు భార్య పోలీసులకు తెలిపింది. ఈ నెల 14 ఆన్‌లైన్‌ మీటింగ్‌లో హాజరు కావాల్సిన సులేమాన్‌ మీటింగ్‌లో పాల్గొనక పోవడంతో ఆరా తీసింది. ఎంతకి తన భర్త అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.హైమవతి, ఇద్దరు పిల్లలుహైమవతి, ఇద్దరు పిల్లలు 

మరిన్ని వార్తలు