పసికందును రైలులో వదిలేసి.. ప్రియుడితో కలిసి

12 Dec, 2021 09:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై: పసికందును లోకల్‌ రైలులో వదిలేసి పారిపోయిన ఓ మహిళతో పాటు ఆమె ప్రియుడిని ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల మేరకు.. నవంబర్‌ 20వ తేదీన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చివరి లోకల్‌ రైలు టిట్వాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ రైలులోని మహిళల బోగీలో విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసుకు ఓ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పసికందు ఉండటంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌ జీఆర్‌పీ, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలోనే అన్ని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించగా, అర్ధరాత్రి తరువాత కోపర్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన ఓ మహిళ డోంబివలి స్టేషన్‌లో దిగిపోయినట్లు గుర్తించారు. రైలు ఎక్కే సమయంలో ఆమె చేతిలో ఉన్న సంచి డోంబివలిలో దిగే సమయంలో లేదు. ఆమె కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రైలు ఎక్కే సమయంలో ఆమె చేతిలో ఉన్న సంచి రంగు, టిట్వాల స్టేషన్‌లో పసికందుతో లభించిన సంచి రంగు ఒకటే కావడంతో పోలీసులకు ఆమెపై అనుమానం మరింత బలపడింది.

దీంతో ఆమె రైలు ఎక్కిన కోపర్‌ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన మహిళ కావచ్చని భావించిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. సుమారు 20 రోజుల పాటు కోపర్‌ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. చివరకు దేవిచ్యా పాడాలో ఆమె పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తొలుత తనకేమీ తెలియదని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ పసికందును తానే వదిలి వెళ్లినట్లు అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పసికందును నేరుల్‌ ప్రాంతంలోని విశ్వ బాలుర సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు