పాపం పసివాడు.. కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ  

15 Mar, 2022 07:48 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివ్యతేజ,  మృతి చెందిన చిన్నారి రిత్విక్‌  

సాక్షి, చిలకలగూడ: వరకట్న వేధింపులు భరించలేక గృహిణి ఏడాది వయసున్న తన కుమారునితో సహా  భవనం పైనుంచి దూకింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. నార్త్‌జోన్‌ డీసీపీ చందన దీప్తి, గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన దివ్యతేజకు, మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్‌కు 2018 సెప్టెంబర్‌ 6న వివాహమైంది. ఈ దంపతులకు గతేడాది మార్చి 3న రిత్విక్‌ జన్మించాడు.

ఈ క్రమంలో మహేందర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం దివ్యతేజను వేధిస్తున్నారు. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె సోమవారం ఉదయం తన కుమారునితో కలిసి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి చేరుకుంది. శానిటైజర్‌ను కుమారునికి తాగించి, తానూ తాగింది. కుమారుని చేతి మణికట్టు, మెడపై కోసి తానూ కోసుకుంది. రక్తస్రావం అవుతుండగా చిన్నారిని పట్టుకుని భవనం పైనుంచి కిందికి దూకింది.
చదవండి: హైదరాబాద్‌: ఫలించిన యాభై ఏళ్ల కల! 

రోడ్డుపై పడిన చిన్నారి రిత్విక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పార్కింగ్‌ చేసిన వాహనంపై పడిన దివ్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మీదాస్, తరుణ లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేందర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని చిలకలగూడ డీఐ నాగేశ్వరరావు తెలిపారు. 
చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?

మరిన్ని వార్తలు