ప్రేమ వివాహం.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై

25 Aug, 2022 21:15 IST|Sakshi

సాక్షి, ఖమ్మం క్రైం: వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంరూరల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఖమ్మంలో చికెన్‌ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొణిజర్ల మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన ఖమ్మం రోటరీనగర్‌లో నివాసముంటున్నాడు.

అయితే, కొంతకాలం కిందట ఆమెకు భర్తతో కలిసి పనిచేసే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించడంలో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. దీంతో ఆమె ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతి భర్తకు ఈనెల 1న ఫోన్‌ చేసి పిలిపించి మద్యం తాగించాక శ్రీనివాస్‌నగర్‌–అగ్రహారం ప్రాంతంలో హత్య చేయడమే కాక చికెన్‌ వ్యర్థాల వాహనంలో తీసుకెళ్లి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని చెరువులో పడవేసినట్లు సమాచారం.

ఆ తర్వాత సదరు యువతి ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయడం బయటపడినట్లు తెలిసింది. అయితే, సదరు వ్యక్తి మృతదేహం ఇంకా లభ్యం కాకపోవటంతో కృష్ణా జిల్లా పోలీసుల సాయంతో అక్కడి చేపల చెరువుల్లో గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఒకటిరెండు రోజుల్లో కేసు వివరాలను వెల్లడించే అవకాశముందని చెబుతున్నారు.   

చదవండి: (కూతురు ప్రేమపెళ్లి.. హాజరుకాని భార్య.. తిరిగి ఇంటికి రావడంతో...)

మరిన్ని వార్తలు