వివాహేతర సంబంధం.. 15 రోజులపాటు కలవకుండా అడ్డుపడటంతో

5 Sep, 2022 13:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్న ఒక భర్త పాలిట భార్యే మృత్యుపాశంగా మారింది. ప్రియుడు, అతని సన్నిహితులతో కలిసి కిరాతకంగా భర్తను మట్టుబెట్టింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా, నగరి మునిసిపాలిటీ రామాపురం వద్ద వెలుగుచూసింది. రామాపురం వద్ద ఉన్న స్టోన్‌క్రషర్‌ కొలనులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్‌కుమార్‌ (32) మృతికి గల కారణాలను పోలీసులు అత్యంత వేగంగా కనుగొన్నారు. తీగలాగితే డొంక బయటపడినట్టు, మృతికి గల కారణాలు వెలుగు చూశాయి.


నిందితులను అరెస్ట్‌ చూపుతున్న సీఐ శ్రీనివాసంతి  

సీఐ శ్రీనివాసంతి తెలిపిన వివరాలు.. నగరిలో సెల్‌ ఫోన్‌ షాపు నడుపుకునే విజయకుమార్‌కు 14 ఏళ్లక్రితం వనిత (30)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయకుమార్‌కు వ్యాపారరీత్యా టీఆర్‌ కండ్రిగకు చెందిన తమిళరసు (21)తో పరిచయం ఏర్పడింది. దీంతో తమిళరసు విజయకుమార్‌ ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఈ క్రమంలో తమిళరసుకు వనితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే కుమార్తెతో అతి చనువుగా తమిళరసు మాట్లాడుతుండడంతో విజయకుమార్‌ తమిళరసును తన ఇంటికి రావద్దని ఆపేశాడు. 15 రోజుల పాటు తమిళరసు, వనిత కలుసుకోవడానికి విజయకుమార్‌ అడ్డుపడుతూ రావడంతో అతన్ని చంపడానికి వీరు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు.

తమిళరసు ఈ ప్లాన్‌లో తనకు మద్యం మిత్రులైన టీఆర్‌ కండ్రిగకు చెందిన తమిళరసు, కాకవేడు దళితవాడకు చెందిన నాగరాజు కొల్లాపురి (20), సంతోష్‌కుమార్‌ (15) కలిశారు. పక్కాగా పథక రచన చేశారు. గత ఆదివారం రాత్రి క్వారీ వద్దకు తమిళరసు, కొల్లాపురి, సంతోష్‌కుమార్‌ ముందుగా చేరుకున్నారు. ఫుల్‌గా మద్యం తాగి, విజయకుమార్‌కు ఫోన్‌చేసి బైక్‌లో పెట్రోల్‌ అయిపోయిందని.. తాము క్వారీ వద్ద ఉన్నామని పెట్రోల్‌ తీసుకురావాలని కోరాడు.

మిత్రుని కోసం పెట్రోల్‌ తీసుకువెళ్లాలని బయలుదేరిన విజయకుమార్‌ వెంట తానూ వస్తానని వనిత బయలు దేరింది. ఇద్దరూ పెట్రోల్‌ తీసుకొని క్వారీ వద్దకు వెళ్లారు. పెట్రోల్‌ను బండిలో పోసే సమయంలో ఈతరాని విజయకుమార్‌ను వెనకనుంచి తమిళరసు తోసివేయగా కొల్లాపురి అతనిపై దూకి నీళ్లలో ముంచే ప్రయత్నం చేశాడు. క్వారీ పై నుంచి వనిత, సంతోష్‌ అతని తలపై రాళ్లువేయడంతో తీవ్రగాయాలపాలైన విజయకుమార్‌ నీటమునిగి మృతిచెందాడు.  
చదవండి: అదృశ్యమైన కారు డ్రైవర్‌ హత్య.. ప్రియుడితో కలిసి భార్య సుపారీ 

ఒకసారి బెడిసికొట్టిన ప్లాన్‌ 
గత ఆదివారానికి ముందు చంపడానికి వీరు ప్లాన్‌ వేసి కత్తిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదేవిధంగా విజయకుమార్‌కు ఫోన్‌ చేసి పెట్రోల్‌ అయిపోయిందని చెప్పడంతో అతను వెళ్లాడు. అయితే ఆ సమయానికి అక్కడ జన సంచారం ఉండడంతో ప్లాన్‌ మిస్సయింది.  

అత్యంత వేగంగా విచారణ 
విజయకుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో విచారణ వేగంగా జరిగింది. విచారణలో తాను దొరుకుతానని తెలుసుకున్న వనిత ముందస్తుగా వీఆర్వో వద్ద సరెండర్‌ కావడంతో, మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం మైనర్‌ను జువైనల్‌ హోంకు పంపగా మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు