ఉద్యోగం మానేసి మరీ ప్రియుడికి దగ్గరైన సారిక..

28 Jun, 2022 09:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నమ్మి ఇంటికి పిలిచిన స్నేహితుడు ఆ బంధానికే మచ్చతెచ్చాడు. స్నేహితుడు భార్యతో చనువు పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు.. కుటుంబంలో కలతలు సృష్టించి దంపతులను వేరు చేశాడు.. తమ ఇద్దరి సఖ్యతకు అడ్డుగా ఉన్నాడని పక్కా ప్రణాళిక రచించి చివరకు భార్యతోనే స్నేహితుడిని హత్య చేయించాడు. 

నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం చిత్తలూరులో ఇటీవల వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దారుణానికి తెగబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి కేసు వివరాలను వివరించారు. నకిరేకల్‌ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్‌(29)కు మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన మామిడికాయల సారికతో 2011లో వివాహం జరిగింది.  వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగిన తర్వాతా కొన్నేళ్లపాటూ మండలాపురంలో జీవించిన కిరణ్‌–సారిక దంపతులు 2015లో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. అక్కడే   ఎన్‌టీఆర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సారిక భర్త మాచర్ల కిరణ్‌కు హాస్పిటల్స్‌లో హౌస్‌కీపింగ్‌ పనులు కాంట్రాక్ట్‌ పట్టే యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన రొడ్డ మల్లేష్‌తో పరిచయం ఏర్పడింది.

స్నేహితుడి భార్యతో చనువు పెంచుకుని..
దీంతో మల్లేష్‌ తరచూ కిరణ్‌ ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలోనే మల్లేష్‌ స్నేహితుడి భార్య అయిన సారికతో చనువు పెంచుకుని సఖ్యతగా మెలుగుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత సారిక వ్యవహారశైలిని గుర్తించిన కిరణ్‌ నిలదీశాడు. దీంతో దంపతుల మధ్య పెరిగిన గొడవలు పెద్ద మనుషుల వద్దకు వెళ్లాయి.   పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ  నిర్వహించగా భార్యాభర్తలకు సర్దిచెప్పి పంపించారు.  

ఇంటికి పిలిచి.. బండరాయితో మోది..
మల్లేష్‌ ప్రణాళిక రచించి సారికను అమలు చేయాలని ప్రోత్సహించాడు. అందులో భాగంగానే  సారిక తనభర్త కిరణ్‌ను ఈనెల 20న చిత్తలూరుకు పిలిపించుకొని సపర్యలు చేసింది. అతడికి మద్యం తాగించి ఇంట్లో నేలపై పడుకోబెట్టింది. నిద్రలోకి జారుకున్న భర్త తలపై బునాది బండరాయితో  రెండుమార్లు బలంగా మోది(కొట్టి) హత్య చేసింది. అనంతరం భర్తను చంపిన విషయాన్ని ఫోన్‌లో ప్రియుడు రొడ్డ మల్లేష్‌కు చెప్పి సూర్యాపేట జిల్లా అర్వపల్లి వైపు పారిపోయింది. ఈనేపధ్యంలో మృతుడి తమ్ముడు మాచర్ల కిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శాలిగౌరారం సీఐ రాఘవరావు ఎస్‌ఐ సతీష్‌ బృందం దర్యాప్తు చేపట్టారు.  నిందితులు అర్వపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న విషయం తెలుసుకుని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సతీష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  

ఉద్యోగం మానేసి మరింత దగ్గరై..
సారిక హాస్పిటల్‌ ఉద్యోగం ఇబ్బందిగా ఉందని మానేసి మల్లేష్‌ వద్ద హౌస్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిలో కుదిరింది. దీంతో  వారిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. ఈ విషయం కిరణ్‌కు తెలియడంతో మళ్లీ దంపతులు గొడవపడ్డారు. దీంతో సారిక అలిగి ఆరు మాసాల క్రితం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. కాగా, ఈ క్రమంలో మల్లేష్‌ భార్య నెలరోజుల క్రితం  అదృశ్యమైంది. అందుకు కిరణ్‌ కారణమని భావించి అతడిపై కక్ష పెంచుకున్నాడు.  ఈ విషయాన్ని సారికతో ఫోన్‌లో చెప్పాడు. దీంతో సారిక కూడా తనభర్త కిరణ్‌ నుంచి తనకు వేధింపులు ఎక్కువ అయ్యాయని వాపోయింది. దీంతో కిరణ్‌ ను హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు