నాలుక కోసి చిత్రహింసలు.. యువతి మృతి

29 Sep, 2020 11:39 IST|Sakshi

సామూహిక అత్యాచార బాధితురాలు మృతి

న్యూఢిల్లీ/లక్నో: గత రెండువారాలుగా చావుతో పోరాడుతున్న సామూహిక అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. నాలుక కోసి అత్యంత దారుణంగా వ్యవహరించిన మృగాళ్ల పశుప్రవర్తనకు బలైపోయింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచింది. వివరాలు.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో గడ్డి కోస్తున్న ఆమెను బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో బాధితురాలిని తొలుత యూపీలోని అలీఘర్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: యువతిపై అత్యాచారం.. )

ఈ క్రమంలో సోమవారం ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా సెప్టెంబరు 14న జరిగిన ఈ పాశవిక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదు తీసుకోవడంలో జాప్యం చేశారంటూ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దళిత యువతి పట్ల ఆధిపత్య కులానికి నిందితులు అమానుషానికి పాల్పడ్డారని, అత్యంత హేయమైన రీతిలో ఆమెపై లైంగిక దాడి చేసిన మృగాళ్లకు కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచార ఘటనలో తాము నలుగురిని అరెస్టు చేశామని, బాధితుల ఫిర్యాదు మేరకు సత్వరమే స్పందించామని పోలీసులు తెలిపారు.  (చదవండివ్యభిచారం నేరం కాదు: బాంబే హైకోర్టు)

మెడకు దుపట్టా చుట్టి లాక్కెళ్లారు..
‘‘మా అమ్మ, అక్క, అన్నయ్య గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లారు. పెద్దమోపు గట్టుకుని మా అన్న ఇంటికి తిరిగి రాగా, వాళ్లిద్దరూ అక్కడే ఉండి గడ్డి కోస్తున్నారు. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. అంతలోనే ఓ నలుగురు ఐదుగురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి మెల్లగా నా సోదరి మెడ చుట్టూ దుపట్టా బిగించి.. పొలాల గుండా లాక్కెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మా అమ్మ తనను వెదుక్కుంటూ వెనకాలే పరిగెత్తింది. కాసేపటి తర్వాత అచేతన స్థితిలో పడి ఉన్న నా సోదరిని చూసింది. వాళ్లు తనను దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడ్డారు. నిజానికి పోలీసులు తొలుత మా గోడును పట్టించుకోలేదు. నాలుగైదు రోజుల తర్వాత చర్యలు తీసుకున్నారు’’అంటూ బాధితురాలి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరిని హతమార్చిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు