విదేశాల నుంచి వచ్చిన కుమారై.. దైవదర్శనానికి వెళ్లివస్తూ..

27 Aug, 2021 10:23 IST|Sakshi
స్వరూపరాణి (ఫైల్‌)

సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): విదేశాల్లో విద్యనభ్యపిస్తున్న కుమార్తె ఇటీవల వచ్చింది. ఆమెకు హైదరాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికిన తల్లిదండ్రులు, సోదరి  పది రోజుల పాటు హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో గడిపారు. ఇక వేములవాడలో రాజన్నను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాక కుమార్తె పెళ్లి సంబంధాలు చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆనందంగా మాట్లాడుకుంటూ కారులో బయలుదేరిన వారి ప్రయాణంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 

సిద్దిపేట హైవేపై ప్రమాదం
ఇల్లెందుకులోని సుభాష్‌నగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ రమేష్‌ కుమార్తె విదేశాల్లో చదువుకుంటోంది. ఇటీవల ఆమె హైదరాబాద్‌ రాగా, తన భార్య చిప్ప స్వరూపరాణి(42), చిన్న కుమార్తె శ్రావ్యతో కలిసి హైదరాబాద్‌లో స్వాగతం పలికాడు. అక్కడే పది రోజుల పాటు బంధువుల ఇంట్లో ఉంటూ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం వేములవాడలో రాజరాజేశ్వరుడి దర్శనానికి గురువారం ఉదయం బయలుదేరగా,  సిద్ధిపేట హైవే రోడ్డు మీద కొండిపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద వీరు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో స్వరూపరాణి అక్కడిక్కడే మృతి చెందింది. కారులో ఉన్న రమేష్, ఆయన ఇద్దరు కుమార్తెలు, సమీప బంధువు గాయాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇల్లెందులో విషాదం అలుముకుంది. గత 25ఏళ్లుగా ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌ చేస్తున్న రమేష్, మెడికల్‌ షాపు నిర్వాహకురాలిగా స్వరూపరాణికి స్థానికంగా మంచి పేరు ఉంది. ఈ మేరకు ఆమె మృతి విషయం తెలియగానే కెమిస్ట్‌ అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు పసుమర్తి లక్ష్మణ్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.

చదవండి: మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు