తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి

23 Sep, 2020 18:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌: ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మధ్యవయస్కురాలితో పాటు గర్భవతి అయిన ఆమె కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను పట్టుకోలేదనే ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. తల్లీకూతుళ్లది ముమ్మాటికి హత్యేనని, హంతకులను అరెస్టు చేసేంతవరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదంటూ భీష్మించుకున్నారు. దీంతో ఆదివారం నుంచి మృతదేహాలు రోడ్డు పక్కనే పడి ఉన్నాయి. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్‌ సెగ)

ఈ క్రమంలో బుధవారం ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గ్రామస్తులను ఒప్పించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. వివరాలు.. రాజానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మనపడ గ్రామానికి చెందిన ప్రమీలా నాథ్‌, సత్యప్రియ(22) సెప్టెంబరు 19న కనిపించకుండా పోయారు. ఆ మరుసటి రోజు గ్రామ శివారులోని ఓ సరస్సులో విగతజీవులుగా తేలారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. (చదవండి: బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి..)

అయితే గ్రామస్తులు మాత్రం తల్లీకూతుళ్లను పథకం ప్రకారం హత్యచేశారని మృతదేహాలతో నిరసనకు దిగారు. పోలీసులే నిందితులను కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న అనుమానితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు