ప్రియుడితో కలిసి బిడ్డను హత్య.. మహిళకు 17 ఏళ్ల జైలుశిక్ష

2 Apr, 2021 14:24 IST|Sakshi

చెన్నై‌: ప్రియుడితో కలిసి బిడ్డను హతమార్చిన కేసులో ఓ మహిళకు 17 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. శివగంగై జిల్లా ఇలయాంగుడికి చెందిన శివానందం సైనికుడు. ఇతని భార్య వనిత (29). వీరి కుమారుడు నందీస్‌కుమార్‌ (4). ఇలావుండగా వనితకు అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ కార్తిక్‌రాజాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు బిడ్డతో ఆంధ్ర రాష్ట్రం తిరుపతికి వెళ్లి అద్దె ఇంట్లో నివసించసాగారు. వీరి రాసలీలీలకు బిడ్డ అడ్డుగా ఉన్నందున తరచుగా అతన్ని కొట్టి హింసించేవారు. గత 2015లో బిడ్డతో కృష్ణగిరి చేరుకోగా అక్కడ బిడ్డ మృతిచెందాడు. కృష్ణగిరిలో బిడ్డను పాతిపెట్టి ఇరువురూ తిరుపతి చేరుకున్నారు.

వీరు అద్దెకుంటున్న ఇంటి యజమాని బిడ్డ ఎక్కడని ప్రశ్నించగా ఆరోగ్యం సరిలేనందున తమ ఊరిలోనే వదిలిపెట్టినట్లు తెలిపారు. దీంతో అనుమానించిన అతను తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి వద్ద విచారణ జరపగా బిడ్డను హతమార్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో కార్తిక్‌రాజా, వనితను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు కోర్టులో బెయిలు పొంది విడుదలయ్యారు. ఆ తర్వాత కార్తిక్‌ రాజా అదృశ్యమయ్యాడు. ఈ కేసులో బుధవారం న్యాయమూర్తి కలైమది తీర్పునిచ్చారు. ఇందులో ప్రియుడితో కలిసి బిడ్డను హతమార్చిన వనితకు 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. కార్తిక్‌రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

చదవండి: ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి
రాజధానిలో వరుస హత్యల కలకలం

మరిన్ని వార్తలు