బెంగళూరులో ఘోరం.. ‘రంజితతో నా తమ్మునికి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను’

15 Sep, 2022 14:51 IST|Sakshi
లక్ష్మమ్మ, కొడుకు మదన్‌ (ఫైల్‌)

సాక్షి, బెంగళూరు : బంధువు వేధిస్తోందని తీవ్ర నిర్ణయం తీసుకుందో తల్లి. ఈ దుర్ఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసుస్టేషన్‌ పరిధిలోని హొసగుడ్డహళ్లిలో జరిగింది. తమ్ముని భార్య సతాయిస్తోందని లక్ష్మమ్మ (48), కొడుకు మదన్‌ (13)ను గొంతు పిసికి చంపి, తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  

తమ్ముని భార్య కేసు పెట్టిందని 
వివరాలు... లక్ష్మమ్మ తమ్ముడు సిద్దేగౌడకు రంజిత అనే యువతితో వివాహమైంది. అప్పుడప్పుడు భార్యభర్తలు గొడవపడేవారు. రంజిత కట్నం, గృహహింస కేసును పెట్టడంతో భర్త సిద్దేగౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో లక్ష్మమ్మ, ఈమె భర్త శివలింగేగౌడతో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో విరక్తి చెంది అకృత్యానికి పాల్పడింది.  

భర్త ఫోన్‌ చేయగా
హొసగుడ్డహళ్లిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ భర్త గాందీనగరలో హోటల్‌ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9:30 హోటల్‌కు భర్త హోటల్‌ నుంచి ఫోన్‌ చేశాడు. ఎంతసేపటికీ స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్‌ చేయగా వారు వెళ్లి చూస్తే శవాలై కనిపించారు. భర్త శివలింగేగౌడ, పెద్ద కొడుకు నవీన్‌ ఇంటికి చేరుకుని విలపించారు.   

పెద్ద తప్పు చేశాను  
రంజితతో నా తమ్మునికి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను, ఆమె వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నాను. నా మరణానికి సవితా, శివణ్ణ, లక్ష్మి, పుట్ట, సిద్ధరాజు, శివలింగ, శంకర, సిద్దరామ అనే వారు కారణమని, భర్త, తమ్ముడు తన అంత్యక్రియలను చేయాలని వీడియోలో తెలిపింది.

మరిన్ని వార్తలు