పిల్లలే దూరమైతే నా బతుకెందుకు..!

7 Dec, 2022 14:57 IST|Sakshi
మృతురాలు గడ్డం శ్రీలత (ఫైల్‌),  భర్త ఇంటి ఎదుట బంధువుల ఆందోళన

సాకక్షి, హైదరాబాద్‌: పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు కలిగినా తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు పేగు తెంచుకుని పుట్టిన సొంత బిడ్డలను సైతం దూరం చేయడంతో మానసికంగా కృంగిపోయిన ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురై పిల్లలే నాకు దూరమైతే నేనెందుకు బతకాలి, ఇంకెందుకు నా బతుకంటూ పుట్టింట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌న గర్‌లో జరిగింది.

భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం సూసైడ్‌ నోటు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తమ బిడ్డ మృతదేహంతో సంజయ్‌నగర్‌ బస్తీలోని భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు.. స్థా నికుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి  జిల్లా, పోచంపల్లి మండలం, అంతమ్మ గూడంనకు చెందిన శ్రీలత(30)కు పదేళ్ల క్రితం బాగ్‌లింగంపల్లికి చెందిన సాగర్‌తో వివాహమైంది. వీరికి చెర్రి (7), హని (6) ఇద్దరు సంతానం.

డీజే సౌండ్‌ సిస్టమ్‌ను నడుపుకునే  సాగర్, అతని తమ్ముడు గడ్డం సతీష్‌ ఓ రాజకీయ పారీ్టలో పనిచేస్తున్నారు. వారి తల్లి భాగ్యలక్ష్మి రైల్వేలో ఉద్యోగి.  గత కొన్నిరోజులుగా సాగర్‌ మద్యం సేవించి భార్య శ్రీలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు తెలిసింది. కాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ తీ వ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా అమ్మకు దయ్యం పట్టిందంటూ ఇద్దరు పిల్లలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలత పుట్టింటికి వెళ్లగా పిల్లలను తనవద్దే ఉంచుకుంటానని చెప్పి భా ర్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఓ అడ్వొకేట్‌ ద్వారా సాగర్‌ భార్యకు నోటీసులు పంపినట్లు సమాచారం.  పిల్లలే దూరమైతే నేనెందుకు బతకాలి, నాబతుకెందుకు అంటూ ఆమె పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.  

భర్త ఇంటిముందు బంధువుల ఆందోళన... 
మంగళవారం ఉదయం 5గంటల నుంచి 6గంటల మధ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీలత మృతదేహానికి స్థానిక పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం శ్రీలత మృతదేహంతో బాగ్‌లింగంపల్లిలోని సంజయ్‌నగర్‌లోని భర్త సాగర్‌ ఇంటి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు సాయంత్రం 4గంటల ప్రాంతంలో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సీఐ సంజీవకుమార్, ఎస్సైలు వెంకట్రమణ, శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్, సందీప్‌రెడ్డితోపాటు ముషీరాబాద్, గాం«దీనగర్, గోషామహల్‌ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

ఈ సందర్భంగా పోలీసులు, మృతిరాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తామని, కనీసం పిల్లలను తమకు అప్పగించేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మీంచుకోని కూర్చున్నారు. ఏసీపీ, సీఐలు ఎంత నచ్చజెప్పినా మృతదేహాన్ని నిందుతుని ఇంటిముందు పెట్టుకోని నిరసన వ్యక్తం చేశారు.

శ్రీలత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఓ ఫ్లెక్సీని ఇంటి గేటుకు తగిలించారు. అయితే గడ్డం సాగర్, అతని తమ్ముడు సతీష్‌కు పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారని బాధితులు ఆరోపించారు. శ్రీలత మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, అప్పుడు మాత్రమే ఆందోళన విరమిస్తామని మృతిరాలి బంధువులు, తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు