కొడుకు మృతిని తట్టుకోలేక.. తల్లి ఆత్మహత్య

24 Feb, 2023 09:17 IST|Sakshi

సాక్షి, మెట్‌పల్లి(జగిత్యాల): తన కొడుకు మృతిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆ తల్లి బావిలో దూకి బలవన్మరణానికి ఒడిగట్టింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌ మండలంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన నేరేళ్ల లక్ష్మీరాజం – రాజగంగు(53) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు శివకుమార్‌(23) ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా, చదువుకుంటున్న కుమారుడు మూడు నెలల క్రితం వరదకాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ తర్వాత ఉపాధి నిమిత్తం లక్ష్మీరాజం దుబాయ్‌కి వెళ్లగా, రాజగంగు ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కుమారుడి మరణంతో మానసికంగా కకుంగిపోయిన ఆమె.. తనకు ఇక బతకబుద్ధి కావడం లేదని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కూతుళ్లు ఆమెకు ఫోన్‌ చేయగా, స్వీచ్‌ఆఫ్‌ అని రావడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. బంధువులతో కలిసి పలుచోట్ల వెతికారు. చివరకు శివారులోని వ్యవసాయ బావిలో చూడగా మృతదేహం కనిపించింది. విగతజీవిగా మారిన తల్లిని చూసి కూతుళ్లు బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు