బ్యాచిలర్స్‌ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి

8 May, 2022 19:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్యాచిలర్స్‌ అద్దెకుంటున్న ఓ ఇంట్లో 35 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధి బాపూజీనగర్‌ సమీపం రామకృష్ణానగర్‌లో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలివీ.. రామకృష్ణానగర్‌లోని బ్యాచిలర్‌ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం స్థానికులు గుర్తించారు.
చదవండి: మరో మహిళతో ఆర్‌ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో..

ఈ విషయాన్ని ఇంటి యజమాని గేదెల సత్యవతికి తెలిపారు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటంతో.. యజమాని కొడుకు ఈశ్వరరావు మారు తాళాలతో తలుపులు తెరిచి చూడగా.. బాత్‌రూమ్‌లో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీపాదరావు, సీఐ కృష్ణారావు, ఎస్‌ఐ అప్పలనాయుడు.. మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.

మహిళ మృతి చెంది మూడు రోజులై ఉంటుందని పోలీసులు తెలిపారు. బాత్‌రూమ్‌లో స్నానానికని వెళ్లే సమయంలో జారిపడి తలకు గాయమై మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె మృతికి ఇతర కారణాలున్నాయో అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇంట్లో మూడు నెలల కిందట ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు దిగారు. వీరు పోర్టులో బొగ్గు పని చేస్తుంటారు. ఉదయం 7 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుంటారు. ఇద్దరిలో ఒకరి పేరు రాజేష్‌గా పోలీసులు గుర్తించారు.

పరారీలో ఇద్దరు యువకులు:
మూడు రోజులుగా ఈ ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాలు, కిరాణా దుకాణాల వద్ద వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ఎస్‌ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
    

మరిన్ని వార్తలు