లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి... భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి..

11 Jul, 2022 08:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి రెల్లివీధిలో చోటుచేసుకుంది. చనిపోయిన మహిళ తల్లిదండ్రులు వడ్డాది వాసు, వడ్డాది జానకి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కాసరపు దుర్గా సాయి శిరీషకి 2017లో మత్స్యకార కుటుంబానికి చెందిన లోకేష్‌తో ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. లోకేష్‌ సీమెన్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విధులకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కొంత కాలంగా తగదాలు జరుగుతున్నాయి.
చదవండి: విషాదం: అల్లుడి మృతి.. ఆగిన మామ గుండె 

దీంతో శిరీష తల్లిదండ్రుల ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం లోకేష్‌ అత్తారింటికి వెళ్లి... భార్యను తమ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లిపోయాడని, ఆ సమయంలో ఇంటి వద్దనే బెల్ట్‌ తీసి తమ కుమార్తెను మా ఎదుటే కొట్టాడని వడ్డాది వాసు, జానకి తెలిపారు. అనంతరం ఆదివారం శిరీష అత్తవారింటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని చెప్పారు. తమ కుమార్తె శరీరంపై దెబ్బలు ఉన్నాయని, భర్తే చంపేసి ఉంటాడని శిరీష తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వన్‌టౌన్‌ పోలీసులను వివరణ కోరగా... మృతురాలు శిరీష తల్లిదండ్రుల ఆరోపణ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించామని తెలిపారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు