ఆత్మహత్య: నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకిన మహిళ

24 Jun, 2021 07:38 IST|Sakshi

బయ్యారం: కొంత పొలం.. ఓ వ్యవసాయ బావి.. పంపకాల్లో గొడవలతో ఆవేదన.. ముందు బిడ్డ, కొద్దిరోజులకు తల్లి.. అదే వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. తల్లిదండ్రుల బాధ చూడలేక 16 ఏళ్ల బిడ్డ ఆత్మహత్య చేసుకోగా, ఆ సమస్య మరింత పెరిగిన బాధతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడులో ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన బిచ్చాకు రాజేందర్, సుఖ్యా ఇద్దరు కుమారులు, బుజ్జి అనే కూతురు ఉంది. బిచ్చా తను కొంత పొలం ఉంచుకుని, మిగతా భూమిని కుమారులకు పంచాడు. అక్కడున్న ఒకే వ్యవసాయ బావి నీటితో ముగ్గురు పంటలు సాగు చేస్తున్నారు. అయితే రాజేందర్‌కు కొంత దూరంలో మరింత భూమి ఉంది. అక్కడ సాగు కోసం ఉమ్మడి వ్యవసాయ బావి నుంచే నీళ్లు తీసుకెళ్తానని రాజేందర్‌ కోరగా.. తండ్రి, సోదరుడు ఒప్పుకోలేదు. భూమి పంపకాలతో బావి నీళ్ల విషయంగా రెండు నెలలు నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపం చెందిన రాజేందర్‌ కుమార్తె మేఘన (16) గత నెల 28న అదే వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనితో తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోయారు.

మళ్లీ గొడవ పడటంతో..
ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కారణంగానే చికాకులు వస్తున్నాయని భావించిన రాజేందర్‌ తన భూమిలో కొత్త ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించాడు. మంగళవారం ఇల్లు పని చేయిస్తుండగా.. రాజేందర్‌ చెల్లెలు బుజ్జి భర్త బాసు అక్కడికి వచ్చి గొడవకు దిగాడు. ఇది కొట్లాటకు దారితీసింది. బుధవారం వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రాజేందర్, ఆయన భార్య జ్యోతి (43) తిరిగి ఇంటికి వెళ్లారు. అప్పటికే బిడ్డ చనిపోయిన ఆవేదనలో ఉన్న జ్యోతి ఈ వివాదాలతో మరింత మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని పొలంలోని అదే వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. తనకు ఈత రావడంతో నడుముకు రాయి కట్టుకుని బావిలో దూకింది. భూవివాదాల కారణంగా తల్లీబిడ్డలు ఒకే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు