వేధింపులకు వివాహిత బలి

9 Aug, 2021 20:50 IST|Sakshi

నల్గొండ : అత్తింటి వేధింపులకు వివాహిత బలైంది. ఈ విషాదకర ఘటన నకిరేకల్‌ మండలం కడపర్తిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని కోటబురుజు వీధికి చెందిన చెవుగోని సైదులుకు ముగ్గురు కుమార్తెలు సంతానం. చిన్న కూతురు ధనలక్ష్మి(23)ని ఇదే మండలం కడపర్తి గ్రామానికి చెందిన గిలకత్తుల శ్రీకాంత్‌తో 2018 సంవత్సరంలో రూ. 20లక్షల వరకు కట్నకానుకలు ముట్టచెప్పి వివాహం జరిపించారు. దీంతో పాటు నకిరేకల్‌లో ఓ ఇళ్లును కూడా ఇచ్చారు. ఈ దంపతులకు ఓ పాప పుట్టి చనిపోయింది. కాగా, అప్పటినుంచి అదనపు కట్నం తీసుకురావాలని ధనలక్ష్మిని భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త వీరమ్మ వేధించడం మొదలుపెట్టారు. ధనలక్ష్మి తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం విజయవాడలో ఉంటున్నారు. ధనలక్ష్మి తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడే డెలివరీ కాగా, బాబు జన్మించాడు.

కాపురానికి తీసుకొచ్చి..
గత జూలై 31న శ్రీకాంత్‌ విజయవాడకు వెళ్లి సజావుగా కాపురం చేసుకుందామని భార్య ధనలక్ష్మిని కడపర్తికి తీసుకువచ్చాడు. అప్పటినుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ధనలక్ష్మి మనస్తాపంతో ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాంత్‌  విషయాన్ని ధనలక్ష్మి తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపాడు. వారు కడపర్తికి వచ్చే లోపే మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నా కూతురు మృతికి అల్లుడు, అతడి తల్లే కారణమని సైదులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు