కటకటాల వెనక్కి నిత్య పెళ్లి కూతురు 

29 Aug, 2020 11:21 IST|Sakshi

దొనకొండ( ప్రకాశం జిల్లా): యువకులు, విద్యావంతులను మోసం చేసి పెళ్లి చేసుకుని ఆనక డబ్బు డిమాండ్‌ చేసి రూ.లక్షలు స్వాహా చేసి చివరకు వారిపై కేసులు పెట్టి వేధించే నిత్య పెళ్లి కూతురును పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పొదిలి సీఐ వేలమూరి శ్రీరామ్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. స్వప్న అనే యువతి హరిణి, కావ్య పేర్లతో చెలామణీ అవుతోంది. ఈ నేపథ్యంలో మండలంలోని వీరేపల్లికి చెంది విపర్ల వీరాంజనేయులు డెన్మార్క్‌లో ఉద్యోగం చేస్తుండగా మ్యాట్రిమోనిలో అతడిని పరిచయం చేసుకుని వివాహం చేసుకుంది. వీరాంజనేయులు ఆమె విషయాలు ఆలస్యంగా తెలుసుకుని స్వగ్రామం నుంచి డెన్మార్కు వెళ్లిపోయాడు. ఆమె గ్రామంలో ఉంటూ కొందరి ఆసరాతో పోలీసుస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఇలా ఆమె ముగ్గురిని వివాహాలు చేసుకుని మోసం చేసింది. (నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ)

మహారాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. నంద్యాలకు చెందిన సుధాకర్‌ బెల్జీయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి పేరుతో అతడిని కూడా మోసం చేసి రూ.25 లక్షలు డిమాండ్‌ చేసింది. అతను పోలీసులను ఆశ్రయించగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఓ మహిళ వద్ద రూ.5 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసింది. ముంబైలో పౌరోహిత్యం చేస్తూ తిరుపతిలో వేద విద్యాభ్యాసం చేస్తున్న దేవక్‌ శుక్లా పూజారిని పెళ్లి పేరుతో మోసం చేసి రూ.20 లక్షలు కొట్టేసింది. ఇలా ఆమె నిత్య పెళ్లి కూతురుగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో నిందితురాలు స్వప్నపై ఎస్‌ఐ ఫణిభూషణ్‌ కేసు నమోదు చేశారు. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేసి బెదిరించి ఇబ్బంది పెడుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను దర్శి సబ్‌ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితురాలిని ఒంగోలు సబ్‌జైలుకు తీసుకెళ్లినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు. (కిలాడీ లేడీ పెళ్లిళ్లు.. మూడో ‘సారీ’)

మరిన్ని వార్తలు