నకిలీ బంగారంతో లక్షల్లో బ్యాంకు రుణం తీసుకున్న మహిళ!

27 Nov, 2021 16:59 IST|Sakshi

కంబాలచెరువు(తూర్పు గోదావరి): నకిలీ బంగారంతో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న మహిళ, ఇద్దరు ఎప్రెంజర్లపై స్థానిక వన్‌ టౌన్, టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమూరుకు చెందిన శనివారపు అనుపమ స్థానిక సాయికృష్ణ థియేటర్‌ సమీపంలోని ఆర్యాపురం అర్బన్‌ బ్యాంకు తాడితోట శాఖలో దపధపాలుగా వన్‌గ్రామ్‌ గోల్డ్‌ తాకట్టు పెట్టి రూ.7.57 లక్షలు అప్పు తీసుకుంది. 

అలాగే అదే బ్యాంకుకు చెందిన దానవాయిపేట శాఖలోనూ ఈ ఏడాది ఆగష్టు 8న వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ పెట్టి రూ.1.59 లక్షలు రుణం తీసుకుంది. కాగా.. బ్యాంకు ఎంప్రెజర్లతో కలసి అనుపమ నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకుందంటూ ఆ బ్యాంకు శాఖల మేనేజర్లకు వాట్సాప్‌ సందేశాలు వచ్చాయి. దీంతో వారు వెంటనే అనుపమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసి పరీక్షించగా నకిలీదిగా తేలింది. దీంతో ఆ మేనేజర్లు తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మహిళ, ఎంప్రెజర్లతో పాటు బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ బ్యాంకులో సొమ్ములు లేవంటూ మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి బాహాటంగా చెప్పిన విషయం విదితమే.   

మరిన్ని వార్తలు