వందరోజుల తరువాత.. పూడ్చేసిన మృతదేహాన్ని వెలికితీసి...

14 May, 2021 04:40 IST|Sakshi

వంద రోజుల తరువాత మృతుని భార్యకు అప్పగింత

మత విశ్వాసాలకు విరుద్ధంగా సౌదీలో ఖననం చేశారని ఢిల్లీ హైకోర్టులో భార్య పిల్‌

మోర్తాడ్‌ (బాల్కొండ): సౌదీ అరేబియాలో తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఖననం చేసిన తన భర్త మృత దేహాన్ని తెప్పించాలని ఢిల్లీ హైకోర్టు ద్వారా న్యాయపోరాటం చేసిన ఓ మహిళ విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్‌ (49) దాదాపు 23 ఏళ్ల నుంచి సౌదీలో పనిచేస్తున్నాడు. జనవరి 24న అతనికి గుండెపోటు రావడంతో సౌదీ బీష్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. జెద్దా భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ట్రాన్స్‌లేటర్‌ చేసిన తప్పిదంతో సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం సౌదీలోనే ఖననం చేశారు.

దీంతో సంజీవ్‌కుమార్‌ భార్య అంజూశర్మ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం సహకారంతో ఢిల్లీ హైకోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం సంజీవ్‌కుమార్‌ మృతదేహాన్ని అంజూశర్మకు స్వాధీన పరచాలని ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని తవ్వితీసి కార్గో విమానంలో బుధవారం ఢిల్లీకి తరలించారు. ఎయిర్‌పోర్టులోనే మృతదేహాన్ని అంజూశర్మకు విదేశాంగ శాఖ అధికారులు అప్పగించారు. 

     

మరిన్ని వార్తలు