లభ్యమైన ఏఓ అరుణ మృతదేహం

30 Nov, 2020 10:01 IST|Sakshi

ఫలించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శ్రమ 

పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్‌కు తరలింపు 

మృతికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని పోలీసులకు ఫిర్యాదు 

సాక్షి, మనూరు(నారాయణఖేడ్‌): నాలుగు రోజుల క్రితం తాను మంజీరా నదిలో దూకి చనిపోతున్నాని సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్న అరుణ(34) తన కుటుంబీకులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసు యంత్రాంగం నదిలో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని శనివారం సాయంత్రం రప్పించి నదిలో వెతకడం ప్రారంభించగా ఆదివారం ఉదయం రెండు బృందాలతో నదిలో దిగువ, ఎగువ ప్రాంతంలో ప్రత్యేక బోటుల ద్వారా గాలించారు. దీంతో రాయిపల్లి వంతెన వద్ద ఎగువన సిరూర్, పాంపడ్‌ శివారులో తేలిన మృతదేహాన్ని కనుగొన్నారు.

అనంతరం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు వారి స్వస్థలమైన నాగల్‌గిద్ద మండలం మోర్గి గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మృతురాలి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజు, ఖేడ్‌ సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేందర్‌లు పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో రాయికోడ్, నాగల్‌గిద్ద ఎస్‌ఐలు ఏడుకొండలు, శేఖర్‌లు మూడురోజులగా పాల్గొని పర్యవేక్షించారు.  చదవండి: మంజీరలో ఏఓ గల్లంతు? 

కుటుంబ సభ్యుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే కారణం 
మృతికి గల కారణం ఆమె కుటుంసభ్యుల వేధింపులేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చే శారు. గత కొన్నాళ్లుగా అరుణ భర్త హోటల్‌ బిజినెస్‌లు నిర్వహించి నష్టపోవడంతో అరుణ బ్యాంకు నుంచి హౌసింగ్‌ లోన్‌ సైతం తీసుకోవడం జరిగిందన్నారు. అయినా కూడా భర్త శివశంకర్‌తోపాటు కుటుంబీకుల వేధింపులు భరించకపోవడంతో ఇలాంటి సంఘటనకు ఒడికట్టిందని కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆవేదన వ్యక్తం చేసిన ఖేడ్‌ ప్రాంత రైతులు.. 
నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో అరుణ గతంలో వ్యవసాయ అధికారిగా పనిచెయ్యడంతో ఇక్కడి రైతులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎళ్లవేళలా రైతలుకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈమె  ప్రాథమిక విద్యాభ్యాసం ఖేడ్‌లోని ప్రగతి విద్యానిలయం పాఠశాలల్లో జరిగింది. ఎంసెట్‌ రాసి అగ్రికల్చర్‌ బీఎస్సీ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చేసిన అనంతరం 2009లో జోగిపేట్‌లో ఏఈఓగా 2010లో ఏఓగా కల్హేర్‌ పోస్టింగ్‌ రాగా కంగ్టి, మనూరు మండలాల ఇన్‌చార్జిలుగా వ్యవహరించడం జరిగింది. 2018లో సంగారెడ్డికి వెళ్లి అక్కడ రైతు శిక్షణ కేంద్రంలో విధులను నిర్వహించారు. 

ఏఓ కుటుంబ సభ్యులకు పరామర్శ
నారాయణఖేడ్‌: మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రైతు శిక్షణా కేంద్రం ఏఓ అరుణ కుటుంబ సభ్యులను జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ నర్సింహారావు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు వైద్యనాథ్, వ్యవసాయ సిబ్బంది, ఆమ్‌ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవులు పరామర్శించి ఓదార్చారు.

అభినందించిన డీఎస్పీ
రాయికోడ్‌(అందోల్‌): మండల శివారులోని మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఓ అరుణ మృతదేహాన్ని ఆదివారం మండలంలోని పాంపాడ్‌ శివారులో గుర్తించి ఒడ్డుకు తెచ్చారు. మృతదేహం కోసం గత నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.  గాలింపు చర్యల్లో సాహసంగా కృషి చేసిన స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్‌ఎఫ్, తెలంగాణ టూరిజం శాఖ, అగ్నిమాపక తదితర శాఖల సిబ్బందిని జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజ్‌  శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ చంద్రయ్య, బాసిత్‌ పటేల్, ఆయా శాఖల సిబ్బంది, మత్స్యకారులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు