అత్యాచారం ఘటనపై స్త్రీ,శిశు సంక్షేమశాఖ సీరియస్

13 Aug, 2020 19:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా అనాథ శరణాలయంలో బాలికపై అత్యాచారం ఘటనపై తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సభ్యులుతో ఓ కమిటీ వేసి,ఆగస్ట్‌ 20లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే అమీన్‌పూర్‌లోని మారుతి అనాథాశ్రమం లైసెన్స్‌ను స్త్రీ, శిశు సంక్షేమశాఖ రద్దు చేసింది. అందులో ఉన్న పిల్లలను అక్కడ నుంచి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. (ప్రియుడి మోసం.. రోడ్డెక్కి యువతి)

కాగా అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ అనాథాశ్రమంలోనూ బిహార్‌ తరహా దారుణం చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అనాథ శరణాలయానికి నిధులిచ్చే నెపంతో ఓ వ్యక్తి.. అక్కడ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశారు. వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి(54)కి శరణాలయం నిర్వాహకులు విజయ, జయదీప్‌ సహకరించారు. బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌తో నీలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. (అమీన్‌పూర్‌లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్‌’)

పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వరరావు కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు మరణించారు. దీంతో బాలికకు వరసకు మేనమామ అయిన శామ్యూల్‌ ఆమెను అమీన్‌పూర్‌ పరిధిలోని మారుతి అనాథాశ్రమంలో చేర్పించాడు. బాలిక అక్కడే అయిదో తరగతి వరకూ చదువుకుంది. ప్రతి ఏటా సెలవుల్లో కొన్నిరోజుల పాటు దూరపు బంధువుల ఇంట్లో ఉండేది. కాగా బాలిక బాత్‌రూమ్‌లో జారిపడటంతో గాయమైందని, ఇంటికి తీసుకు వెళ్లాలంటూ ఆశ్రమం నిర్వాహకులు బాలిక బంధువు అయిన అనిల్‌కు ఫోన్‌ చేశారు. దీంతో ఆయన ఈ ఏడాది మార్చి 21న ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. (ఇక.. చూస్తుండగానే బూడిద!)

అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. తిరిగి జూలై 29న ఆమెను అనాథ శరణాలయానికి తీసుకువెళ్లగా, ఆమెను చేర్పించుకునేందుకు ఆశ్రమం నిర్వాహకురాలు విజయ నిరాకరించారు. దీంతో బాలిక మరో బంధువైన ప్రీతి ఇంటికి తీసుకు వెళ్లారు. బాలిక పరిస్థితిని చూసి గట్టిగా ప్రశ్నించడంతో తనపై జరిగిన అకృత్యాలను ఆ చిన్నారి బయటపెట్టింది. దీంతో బంధువులు గత నెల 31న బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  పోక్సో చట్టం కింద విజయ, జయదీప్‌, వేణుగోపాల్‌రెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు