కిలాడి లేడీ అరెస్టు.. రూ. 8 కోట్లకు టోకరా

6 Jan, 2021 08:03 IST|Sakshi

సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌భవన్‌ రోడ్డులోని సేథీ టవర్స్‌కు చెందిన పి.విజయ్‌ ఎన్‌.రాజు ఇన్వెస్టర్‌. 2013లో అతని వద్దకు కూకట్‌పల్లి, వసంత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్‌బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్‌బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్‌ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు.

ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్‌ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు